Isaiah 43 in Telugu

1 అయితే యాకోబూ, నిన్ను పుట్టించిన యెహోవా, ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఇలా చెబుతున్నాడు, “నేను నిన్ను విమోచించాను, భయపడకు. నిన్ను పేరుపెట్టి పిలుచుకున్నాను. నువ్వు నా సొత్తు.

2 నువ్వు ప్రవాహాలను దాటేటప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. నదులగుండా వెళ్ళేటప్పుడు అవి నిన్ను ముంచివేయవు. నువ్వు అగ్నిగుండా నడచినా కాలిపోవు, జ్వాలలు నీకు కీడు చేయవు

3 యెహోవా అనే నేను నీకు దేవుణ్ణి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నీ రక్షకుణ్ణి. నీ ప్రాణరక్షణ క్రయధనంగా ఐగుప్తును, నీకు బదులుగా కూషును, సెబాను ఇచ్చాను.

4 నువ్వు నాకు ప్రియుడివి, ప్రశస్తమైనవాడివి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి నీకు ప్రతిగా జాతులను, నీ ప్రాణానికి బదులుగా జనాలను అప్పగిస్తున్నాను.

5 భయపడవద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానాన్ని రప్పిస్తాను. పడమటి నుండి నిన్ను సమకూరుస్తాను.

6 ‘వారిని అప్పగించు’ అని ఉత్తరదిక్కుకు, ‘అడ్డగించ వద్దు’ అని దక్షిణదిక్కుకు ఆజ్ఞాపిస్తాను. దూర ప్రాంతాల నుండి నా కుమారులను, భూమి అంచుల నుండి నా కుమార్తెలను తెప్పించు.

7 నా మహిమ కోసం నేను సృజించి నా పేరు పెట్టినవారందరినీ పోగుచెయ్యి. వారిని కలగజేసింది, వారిని పుట్టించింది నేనే.

8 కళ్ళుండీ గుడ్డివారుగా, చెవులుండీ చెవిటివారుగా ఉన్న వారిని తీసుకురండి

9 రాజ్యాలన్నీ గుంపులుగా రండి. ప్రజలంతా సమావేశం కండి. వారిలో ఎవరు ఇలాటి సంగతులు చెప్పగలిగారు? గతంలో జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించ గలిగి ఉండేవారు? తమ యథార్థతను రుజువు చేసుకోడానికి తమ సాక్షులను తేవాలి. లేకపోతే వాళ్ళు విని ‘అవును, అది నిజమే’ అని ఒప్పుకోవాలి.

10 నన్ను నమ్మి నేనే ఆయనను అని గ్రహించేలా మీరు, నేను ఎన్నుకున్న నా సేవకుడు నాకు సాక్షులు. నాకంటే ముందు ఏ దేవుడూ ఉనికిలో లేడు, నా తరవాత ఉండడు.

11 యెహోవా అనే నేను నేనొక్కడినే. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.

12 ప్రకటించిన వాడినీ నేనే, రక్షించిన వాడినీ నేనే. దాన్ని గ్రహించేలా చేసిందీ నేనే. మీలో ఇంకా వేరే దేవత ఎవరూ లేరు. నేనే దేవుణ్ణి, మీరు నాకు సాక్షులు.” ఇదే యెహోవా వాక్కు.

13 “నేటి నుండి నేనే ఆయనను. నా చేతిలో నుండి ఎవరినైనా విడిపించగలిగే వాడెవడూ లేడు. నేను చేసిన పనిని తిప్పివేసే వాడెవడు?”

14 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, మీ విమోచకుడు యెహోవా ఇలా చెబుతున్నాడు, “మీ కోసం నేను బబులోనుపై దండెత్తి వారు గర్వకారణంగా భావించే ఓడల్లోనే పారిపోయేలా చేస్తాను.

15 మీ పరిశుద్ధ దేవుణ్ణి, యెహోవాను నేనే. ఇశ్రాయేలు సృష్టికర్తనైన నేనే మీకు రాజుని.”

16 సముద్రంలో రహదారి కలిగించినవాడూ, నీటి ప్రవాహాల్లో మార్గం ఏర్పాటు చేసేవాడూ

17 రథాలూ, గుర్రాలూ, సైన్యాన్నీ యుద్ధవీరుల్నీ రప్పించినవాడూ అయిన యెహోవా ఇలా చెబుతున్నాడు, వారంతా ఒకేసారి పడిపోయారు. ఆరిపోయిన జనపనారలాగా మళ్ళీ లేవకుండా నాశనమైపోయారు.

18 “గతంలో జరిగిన సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలపు సంగతులను ఆలోచించవద్దు.

19 ఇదిగో, నేనొక కొత్త కార్యం చేస్తున్నాను. అది ఇప్పటికే మొదలైంది. మీరు దాన్ని గమనించరా? నేను అరణ్యంలో దారి నిర్మిస్తాను. ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాను.

20 అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్లు నన్ను ఘనపరుస్తాయి. ఎందుకంటే నేను ఏర్పరచుకొన్న ప్రజలు తాగటానికి అరణ్యంలో నీళ్ళు పుట్టిస్తున్నాను. ఎడారిలో నదులు పారజేస్తాను.

21 నా కోసం నేను నిర్మించుకున్న ప్రజలు నా గొప్పతనాన్ని ప్రచురిస్తారు.

22 కానీ యాకోబూ, నువ్వు నాకు మొర్రపెట్టడం లేదు. ఇశ్రాయేలూ, నా విషయంలో విసిగిపోయావు.

23 దహనబలుల కోసం నీ గొర్రెల్నీ మేకల్నీ నా దగ్గరికి తేలేదు. బలులర్పించి నన్ను ఘనపరచలేదు. నైవేద్యాలు చేయాలని నేను నీపై భారం మోపలేదు. ధూపం వేయమని నిన్ను విసిగించలేదు.

24 నా కోసం సువాసన గల లవంగపు చెక్కను నువ్వు డబ్బు ఇచ్చి కొనలేదు. నీ బలి పశువుల కొవ్వుతో నన్ను తృప్తిపరచకపోగా, నీ పాపాలతో నన్ను విసిగించావు. నీ దోషాలతో నన్ను రొష్టుపెట్టావు.

25 ఇదిగో, నేను, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలను తుడిచివేస్తున్నాను. నేను నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను.

26 ఏం జరిగిందో నాకు జ్ఞాపకం చెయ్యి. మనం కలిసి వాదించుకుందాం. నీ వాదన వినిపించి నువ్వు నిరపరాధివని రుజువు చేసుకో.

27 నీ మూలపురుషుడు పాపం చేశాడు. నీ నాయకులు నామీద తిరుగుబాటు చేశారు.

28 కాబట్టి దేవాలయంలో ప్రతిష్ఠితులైన నాయకులను అపవిత్రపరుస్తాను. యాకోబును శాపానికి గురిచేసి, దూషణ పాలు చేస్తాను.”