Exodus 40 in Telugu

1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.

2 “మొదటి నెల మొదటి రోజున నువ్వు సన్నిధి గుడారం ఉన్న మందిరాన్ని నిలబెట్టాలి.

3 అక్కడ శాసనాల పెట్టెను నిలబెట్టి దాన్ని అడ్డ తెరతో మూసి ఉంచాలి.

4 బల్లను లోపలికి తెచ్చి దాని మీద ఉంచవలసిన వాటిని క్రమంగా ఉంచాలి. దీప స్తంభాన్ని లోపలికి తెచ్చి దాని దీపాలు వెలిగించాలి.

5 శాసనాల పెట్టె ఎదురుగా బంగారు ధూపవేదికను ఉంచి, మందిర ద్వారానికి తెర తగిలించాలి.

6 సన్నిధి గుడారం ఉన్న మందిరం ద్వారం ఎదురుగా హోమ బలిపీఠం ఉంచాలి.

7 సన్నిధి గుడారం, హోమ బలిపీఠం మధ్యలో ఒక గంగాళం పెట్టి, దాన్ని నీళ్ళతో నింపాలి.

8 తెరల చుట్టూ ప్రహరీ నిలబెట్టి, ప్రహరీ ద్వారానికి తెర తగిలించాలి.

9 అభిషేక తైలం తీసుకుని దైవ నివాసాన్నీ, అందులోని వాటన్నిటినీ అభిషేకించాలి. దానినీ, దానిలోని సామగ్రి అంతటినీ ప్రతిష్టించాలి. అప్పుడు అది పవిత్రం అవుతుంది.

10 హోమ బలిపీఠాన్ని అభిషేకించి, దాన్ని ప్రతిష్ఠించాలి. అప్పుడు ఆ పీఠం పవిత్రం అవుతుంది.

11 గంగాళాన్ని, దాని పీటను అభిషేకించి, వాటిని ప్రతిష్ఠించాలి.

12 తరువాత అహరోనును, అతని కొడుకులను సన్నిధి గుడారం ద్వారం దగ్గరికి వెంటబెట్టుకుని తీసుకువచ్చి నీళ్లతో స్నానం చేయించాలి.

13 అతనికి పవిత్ర వస్త్రాలు తొడిగి అతడు నాకు యాజకుడుగా సేవ జరిగించడానికి అతన్ని అభిషేకించి ప్రతిష్ఠించాలి.

14 తరువాత అతని కొడుకులను తీసుకువచ్చి వాళ్లకు చొక్కాలు తొడిగించాలి.

15 వాళ్ళు కూడా నాకు యాజకులుగా ఉండేలా వాళ్ళ తండ్రిని అభిషేకించినట్టు వాళ్ళను అభిషేకించి ప్రతిష్టించు. వారి అభిషేకం తరతరాలకు నిత్యమూ నిలిచే యాజకత్వ చిహ్నంగా ఉంటుంది.”

16 మోషే ఆ విధంగా చేశాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినదంతా జరిగించాడు.

17 రెండవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున దైవ నివాస మందిరం నిలబెట్టాడు.

18 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు దైవ నివాస మందిరం నిలబెట్టి దాని దిమ్మలు వేసి, దాని పలకలను నిలబెట్టి దాని అడ్డకర్రలు అమర్చి, స్తంభాలను నిలిపాడు.

19 మందిరం పైన గుడారం పరిచాడు. గుడారానికి పైకప్పు వేశాడు.

20 యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు శాసనాలను మందసంలో ఉంచాడు. మందసాన్ని మోసే కర్రలను పెట్టెకు దూర్చి దానిపైన కరుణా స్థానం మూత ఉంచాడు.

21 మందసాన్ని దైవ సన్నిధి మందిరంలోకి తెచ్చి అడ్డతెర వేలాడదీసి శాసనాల పెట్టెను కప్పాడు.

22 సన్నిధి గుడారంలో, దైవ సన్నిధి మందిరం ఉత్తర దిక్కున, అడ్డతెరకు బయట బల్లను ఉంచాడు.

23 యెహోవా సన్నిధి ఎదుట బల్లమీద రొట్టెలను క్రమంగా పేర్చాడు.

24 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు సన్నిధి గుడారంలో మందిరానికి దక్షిణం వైపున బల్ల ఎదుట దీపస్తంభం ఉంచాడు.

25 యెహోవా సన్నిధానంలో దీపాలు వెలిగించాడు.

26 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు సన్నిధి గుడారంలో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదిక ఉంచాడు.

27 ధూపవేదిక మీద పరిమళ ద్రవ్యాలను కాల్చి ధూపం వేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా చేశాడు.

28 మందిర ద్వారానికి తెర ఏర్పాటు చేశాడు. అతడు దైవ సన్నిధి గుడారం ద్వారం దగ్గర హోమపీఠం ఉంచాడు.

29 హోమ బలిపీఠం మీద హోమబలి అర్పించి నైవేద్యం సమర్పించాడు.

30 యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు దైవసన్నిధి గుడారానికి, హోమ పీఠానికి మధ్య గంగాళం ఉంచి శుభ్రపరచుకోవడానికి దానిలో నీళ్లు పోయించాడు.

31 అక్కడ మోషే, అహరోను, అతని కొడుకులు తమ కాళ్ళు, చేతులు కడుక్కున్నారు.

32 వాళ్ళు దైవసన్నిధి గుడారం లోపలికి ప్రవేశించినప్పుడు, హోమపీఠం చెంతకు వచ్చినప్పుడు తమ కాళ్ళు, చేతులు కడుక్కున్నారు.

33 మోషే మందిరానికి, హోమపీఠానికి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశాడు. ఆవరణ ద్వారం తెర వేశాడు. ఈ విధంగా మోషే పని మొత్తం ముగించాడు.

34 అప్పుడు మేఘం సన్నిధి గుడారాన్ని కమ్ముకుంది. దైవ నివాసం యెహోవా మహిమా ప్రకాశంతో నిండింది.

35 ఆ మేఘం దైవసన్నిధి గుడారంపై నిలిచి ఉండడం వల్ల మందిరం యెహోవా తేజస్సుతో నిండిపోయింది. అందువల్ల మోషే దైవసన్నిధి గుడారం లోపలి వెళ్ళలేక పోయాడు.

36 మేఘం మందిరం మీదనుండి పైకి వెళ్ళే సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసేవాళ్ళు.

37 ఆ మేఘం పైకి వెళ్ళకపోతే అది వెళ్ళే రోజు దాకా ప్రయాణం ఆపివేసే వాళ్ళు. ఇది వాళ్ళు ప్రయాణం చేసే పద్ధతి.

38 ఇశ్రాయేలు ప్రజలందరి సమక్షంలో పగటివేళ యెహోవా మేఘం దైవనివాసం మీద ఉండేది. రాత్రి సమయాల్లో మేఘంలో అగ్ని స్థంభం ఉండేది. ప్రజల ప్రయాణాలన్నిటిలో ఈ విధంగా జరిగింది.