2 Samuel 21 in Telugu

1 దావీదు పరిపాలిస్తున్న కాలంలో మూడేళ్ళపాటు కరువు కొనసాగింది. దావీదు యెహోవాతో మనవి చేశాడు. అందుకు యెహోవా ఇలా చెప్పాడు. “సౌలు గిబియోనీయులను హతమార్చాడు. అతణ్ణి బట్టి, నరహంతకులైన అతని ఇంటివారిని బట్టి శిక్షగా ఈ కరువు ఏర్పడింది.”

2 గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు. వారు అమోరీయుల్లో మిగిలిపోయిన వారు. సౌలు రాజు కాక ముందు ఇశ్రాయేలీయులు “మిమ్మల్ని చంపం” అని గిబియోనీయులతో ఒప్పందం చేసుకున్నారు. సౌలు ఇశ్రాయేలు, యూదా వారిపట్ల అమితమైన ఆసక్తి కనపరచి గిబియోనీయులను హతం చేస్తూ వచ్చాడు.

3 దావీదు గిబియోనీయులను పిలిపించి “మీరు యెహోవా సొత్తును దీవించడానికి మా దోషం తొలగిపోయేందుకు పరిహారంగా నేను మీకు ఏమి చేయాలని కోరుకుంటున్నారు?” అని అడిగాడు.

4 గిబియోనీయులు “సౌలు అతని ఇంటి వారు చేసినదాన్ని బట్టి పరిహారం చేయడానికి వెండి, బంగారాలు గానీ, ఇశ్రాయేలీయుల్లో ఎవరినైనా చంపాలని గానీ మేము కోరుకోవడం లేదు” అన్నారు. అప్పుడు దావీదు “మీరేమి కోరుకున్నా అది మీకు చేస్తాను” అన్నాడు.

5 వారు “ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో ఉండకుండా మాకు శత్రువులై మమ్మల్ని నాశనం చేస్తూ మేము నిర్మూలం అయ్యేలా కీడు కలిగించినవాడి కుమారుల్లో ఏడుగురిని మాకు అప్పగించు.

6 యెహోవా నియమించిన సౌలు పట్టణమైన గిబియాలో యెహోవా సన్నిధానంలో మేము వారిని ఉరితీస్తాం” అని రాజును కోరారు. అప్పుడు రాజు “నేను వారిని మీకు అప్పగిస్తాను” అన్నాడు.

7 అతడు సౌలు కొడుకు యోనాతానుకు యెహోవా పేరిట చేసిన ప్రమాణం కారణంగా యోనాతాను కొడుకు మెఫీబోషెతును కాక,

8 అయ్యా కుమార్తె రిస్పా ద్వారా సౌలుకు పుట్టిన యిద్దరు కొడుకులు అర్మోని, మెఫీబోషెతులను, సౌలు కూతురు మెరాబుకు మెహూలతీయుడైన బర్జిల్లయి కొడుకు అద్రీయేలు ద్వారా పుట్టిన ఐదుగురు కొడుకులను తీసుకువచ్చి గిబియోనీయులకు అప్పగించాడు.

9 వారు ఈ ఏడుగురిని తీసుకువెళ్ళి యెహోవా సన్నిధానంలో కొండ మీద ఏడుగురినీ ఒకే విధంగా ఉరితీశారు. యవల పంట కోతకాలం ఆరంభంలో వారు చనిపోయారు.

10 అయ్యా కూతురు రిస్పా గోనెపట్ట తీసుకు కొండపైన పరచుకుని కోతకాలం ఆరంభం నుండి మృతదేహాలపై ఆకాశం నుండి వానలు కురిసే దాకా అక్కడే ఉండిపోయి, పగలు ఆకాశపక్షులు వాటిమీద వాలకుండా, రాత్రులు అడవి జంతువులు వాటి దగ్గరికి రాకుండా వాటిని కాపలా కాస్తూ ఉన్నది.

11 సౌలు ఉపపత్ని అయ్యా కూతురు రిస్పా చేసిన పని దావీదుకు తెలిసింది.

12 కాబట్టి దావీదు వెళ్లి సౌలు, అతని కొడుకు యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారి దగ్గర నుండి తెప్పించాడు. గిల్బోవలో ఫిలిష్తీయులు సౌలు, యోనాతానులను హతం చేసి బేత్షాను పట్టణపు వీధిలో వేలాడదీసినప్పుడు యాబేష్గిలాదు వారు వారి ఎముకలను అక్కడినుంచి దొంగిలించి తెచ్చి తమ దగ్గర ఉంచుకున్నారు.

13 కనుక దావీదు వారిదగ్గర నుండి సౌలు, అతని కొడుకు యోనాతాను ఎముకలను తెప్పించాడు. రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు సేవకులు ఉరితీసిన ఏడుగురి ఎముకలను సమకూర్చారు.

14 సౌలు, అతని కొడుకు యోనాతాను ఎముకలను వాటితో కలిపి బెన్యామీనీయుల దేశంలోని సేలాలో ఉన్న సౌలు తండ్రి కీషు సమాధిలో పాతిపెట్టారు. ఇదంతా చేసిన తరువాత రాజు దేశం కోసం చేసిన విజ్ఞాపన దేవుడు అంగీకరించాడు.

15 ఫిలిష్తీయులకు, ఇశ్రాయేలీయులకు మళ్ళీ యుద్ధం జరిగినప్పుడు దావీదు తన సేవకులతో కలసి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో దావీదు నీరసించి సొమ్మసిల్లిపోయాడు.

16 అక్కడ రెఫాయీయుల సంతానం వాడైన ఇష్బిబేనోబ అనేవాడు కొత్తగా చేసిన కత్తి, మూడున్నర కిలోల బరువున్న ఇత్తడి ఈటె పట్టుకుని “నేను దావీదును చంపుతాను” అని చెబుతూ వచ్చాడు.

17 సెరూయా కొడుకు అబీషై రాజును కాపాడి ఆ ఫిలిష్తీయుణ్ణి కొట్టి చంపాడు. ఇది చూసిన దావీదు మనుషులు “ఇశ్రాయేలీయులకు దీపమైన నువ్వు ఆరిపోకుండా ఉండేలా ఇకపై మాతో కలసి యుద్ధాలకు రావద్దు” అని చెప్పి, అతని చేత ఒట్టు పెట్టించారు.

18 ఆ తరువాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో మళ్ళీ యుద్ధం జరిగింది. యుద్ధంలో హూషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతానం వాడైన సఫును చంపాడు.

19 గోబు దగ్గర ఫిలిష్తీయులతో మరోసారి యుద్ధం జరిగినప్పుడు అక్కడ బేత్లెహేము నివాసి యహరేయోరెగీము కొడుకు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుణ్ణి చంపాడు. వాడి చేతిలో ఉన్న ఈటె నేతగాని అడ్డకర్ర అంత పెద్దది.

20 మరొక యుద్ధం గాతు దగ్గర జరిగింది. అక్కడ బాగా పొడవైనవాడు ఒకడు ఉన్నాడు. వాడి చేతులకు, కాళ్ళకు ఆరు వేళ్ళు చొప్పున మొత్తం ఇరవై నాలుగు వేళ్ళు ఉన్నాయి. అతడు రెఫాయీయుల సంతానం వాడు.

21 వాడు ఇశ్రాయేలీయులను దూషిస్తున్నప్పుడు దావీదు సోదరుడు షిమ్యా కొడుకు యోనాతాను వాణ్ణి చంపివేశాడు.

22 గాతులో ఉన్న రెఫాయీయుల సంతతివారైన ఈ నలుగురినీ దావీదు, అతని సేవకులు హతం చేశారు.