Romans 14 in Telugu

1 విశ్వాసం విషయంలో బలహీనంగా ఉన్న వారిని చేరదీయండి గానీ వారి అనుమానాలు తీర్చడానికి వాదాలు పెట్టుకోవద్దు.

2 ఆహార పదార్ధాలు అన్నీ తినవచ్చని ఒకడు నమ్ముతుంటే, ఇంకొకడు నమ్మకం లేక కూరగాయలే తింటున్నాడు.

3 తినేవాడు తినని వాణ్ణి తక్కువగా చూడకూడదు. తినని వాడు తినేవాడిపై నిందారోపణ చేయకూడదు. ఎందుకంటే దేవుడు అతణ్ణి అంగీకరించాడు.

4 వేరొకరి సేవకుని విషయంలో న్యాయం చెప్పడానికి నువ్వెవరివి? అతడు నిలబడినా, పడిపోయినా అది అతని యజమాని బాధ్యత. కాని అతడు నిలబడతాడు. ప్రభువు అతణ్ణి నిలబెట్టడానికి శక్తి గలవాడు.

5 ఇంకొక చోట ఒకడు ఒక రోజు కంటే మరొక రోజు మంచిదని నమ్ముతున్నాడు. ఇంకొకడు రోజులన్నీ మంచివే అని నమ్ముతున్నాడు. ప్రతివాడూ తనకు తాను ఒక నిర్ణయానికి రావాలి.

6 ప్రత్యేకమైన రోజులను పాటించేవాడు ప్రభువు కోసమే ఆ పని చేస్తున్నాడు. తినేవాడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు కాబట్టి ప్రభువు కోసమే తింటున్నాడు. అలాగే తిననివాడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి ప్రభువు కోసమే తినడం మానేస్తున్నాడు.

7 మనలో ఎవరూ తన కోసమే బతకడు, తన కోసమే చనిపోడు.

8 మనం జీవించినా ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే. కాబట్టి మనం జీవించినా, చనిపోయినా ప్రభువుకే చెంది ఉన్నాం.

9 చనిపోయిన వారికీ సజీవులకూ ప్రభువుగా ఉండటానికే గదా క్రీస్తు చనిపోయి మళ్ళీ బతికింది?

10 అయితే నీ సోదరునికి ఎందుకు తీర్పు తీరుస్తున్నావ్? నీ సోదరుణ్ణి ఎందుకు తీసిపారేస్తున్నావ్? మనమంతా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం.

11 “నిశ్చయంగా జీవిస్తున్న నేను చెప్పే దేమిటంటే, ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది. ప్రతి నాలుకా దేవుని స్తుతిస్తుంది అని ప్రభువు చెబుతున్నాడు” అని రాసి ఉంది.

12 కాబట్టి మనలో ప్రతి ఒక్కడూ తన గురించి దేవునికి లెక్క అప్పగించ వలసి ఉంది.

13 కాబట్టి ఇకమీదట మనం ఒకరికి ఒకరం తీర్పు తీర్చ వద్దు. దానికి ప్రతిగా, మన సోదరునికి అడ్డురాయిలాగా ఆటంకంగా ఉండకూడదని తీర్మానించుకుందాం.

14 సహజంగా ఏదీ అపవిత్రం కాదని నేను ప్రభు యేసులో గ్రహించి గట్టిగా నమ్ముతున్నాను. అయితే దేనినైనా అపవిత్రం అని నమ్మే వారికి అది అపవిత్రమే అవుతుంది.

15 నీ సోదరుడు నీవు తినేదాని విషయంలో బాధకు గురైతే నీలో ప్రేమ లేదన్నమాటే. ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో అతణ్ణి నీ ఆహారం చేత పాడు చేయవద్దు.

16 మీరు మంచిగా భావించేది దూషణకు గురి కాకుండా చూసుకోండి.

17 దేవుని రాజ్యం తినడం, తాగడం కాదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ కలిగించే ఆనందం.

18 ఈ విధంగా క్రీస్తుకు సేవ చేసేవాడు దేవుని దృష్టికి ఇష్టమైన వాడు, మనుషుల దృష్టికి యోగ్యుడు.

19 కాబట్టి సమాధానం, పరస్పర క్షేమాభివృద్ధిని కలిగించే వాటిని ఆసక్తితో అనుసరించుదాం.

20 ఆహారం కోసం దేవుని పని పాడు చేయవద్దు. అన్ని ఆహార పదార్ధాలూ పవిత్రమైనవే. కానీ ఎవరైనా తాను తిన్న దాని మూలంగా ఇతరులకు తొట్రుపాటు కలిగిస్తే అది కీడు.

21 మాంసం తినడం, ద్రాక్షారసం తాగటం, ఇంకా మరేదైనా సరే, నీ సోదరుడు ఆటంకంగా భావిస్తే, దాన్ని మానివేయడం మంచిది.

22 ఈ విషయాల్లో నీ నమ్మకాలను నీకు, దేవునికి మధ్యనే ఉంచుకో. తాను సమ్మతించిన విషయంలో తనపై తాను నిందారోపణ చేసుకోని వ్యక్తి ధన్యుడు.

23 అనుమానించే వాడు తింటే, విశ్వాసం లేకుండా తింటాడు కాబట్టి అతడు దోషం చేసినట్టే. విశ్వాసమూలం కానిది ఏదైనా పాపమే.