Romans 1 in Telugu

1 యేసు క్రీస్తు దాసుడు, అపోస్తలుడుగా పిలుపు పొందినవాడు, దేవుని సువార్త కోసం ప్రభువు ప్రత్యేకించుకున్న

2 పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అంటే పవిత్రులుగా ఉండడానికి పిలుపు పొందిన వారికి శుభాలు చెబుతూ రాస్తున్నది.

3 మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.

4 దేవుడు తన కుమారుడు, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు గురించిన ఆ సువార్తను పవిత్ర లేఖనాల్లో తన ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశాడు.

5 యేసు క్రీస్తు, శారీరికంగా చూస్తే దావీదు సంతానం. దేవుని పవిత్రమైన ఆత్మ సంబంధంగా చనిపోయి తిరిగి సజీవుడుగా లేవడం ద్వారా ఆయన దేవుని కుమారుడు అని బల ప్రభావాలతో ప్రకటించబడింది.

6 ఈయన నామం నిమిత్తం అన్ని జాతుల ప్రజలు విశ్వాసానికి విధేయులయ్యేలా ఈయన ద్వారా మేము కృప, అపొస్తలత్వం పొందాము.

7 వారితోబాటు మీరు కూడా యేసు క్రీస్తుకు చెందిన వారుగా ఉండడానికి పిలుపు పొందారు.

8 మీ విశ్వాసం లోకమంతా ప్రచురం కావడం చూసి, మొదట మీ అందరి కోసం యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను.

9 ఏదో ఒక విధంగా చివరికి మీ దగ్గరికి రావడానికి దేవుని చిత్తం వలన నాకు వీలవుతుందేమో అని నా ప్రార్థనల్లో ఎప్పుడూ ఆయనను బతిమాలుకుంటున్నాను. మిమ్మల్ని ఎడతెగక ప్రస్తావిస్తున్నాను. ఆయన కుమారుడి సువార్త కోసం నేను నా ఆత్మలో సేవిస్తున్న దేవుడే ఇందుకు సాక్షి.

11 మీరు స్థిరపడాలనీ, మీరూ నేనూ ఒకరి విశ్వాసం చేత ఒకరం ఆదరణ పొందడం కోసం మిమ్మల్ని చూడాలనీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఏదైనా కృపావరాన్ని మీకు అందించాలని నా ఆశ.

13 సోదరులారా, ఇది మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను చాలా సార్లు మీ దగ్గరకి రావడానికి ప్రయత్నించాను గాని ప్రతిసారీ ఆటంకం వచ్చింది. యూదేతర ప్రజల మధ్య నేను పొందిన పరిచర్య ఫలాలు మీ మధ్య కూడా పొందాలని నా ఆకాంక్ష.

14 గ్రీకులకూ, ఇతరులకూ, తెలివైన వారికీ, బుద్ధిహీనులకూ నేను రుణపడి ఉన్నాను.

15 కాబట్టి రోమాలోని మీకు కూడా సువార్త ప్రకటించాలన్న ఆశతో నేను సిద్ధంగా ఉన్నాను.

16 సువార్తను గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే మొదట యూదుడికి, తరవాత గ్రీసు జాతి వాడికి నమ్మే ప్రతి ఒక్కరికీ అది దేవుని శక్తి.

17 నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు, అని రాసి ఉన్న ప్రకారం విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా దేవుని నీతి దానిలో వెల్లడి అవుతున్నది.

18 ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది.

19 ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు.

20 ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.

21 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది.

22 తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే.

23 వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.

24 ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు.

25 వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు.

26 ఈ కారణంగా దేవుడు వారిని నీచమైన కోరికలకు అప్పగించాడు. వారి స్త్రీలు సైతం సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు.

27 అదే విధంగా పురుషులు కూడా తాము సహజంగా స్త్రీలతో జరిగించవలసిన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు చేయదగని విధంగా ప్రవర్తించారు. ఆ విధంగా వారు తమ కామాగ్నిలో మాడిపోయి తమ తప్పుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు.

28 వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు.

29 వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు.

30 వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు,

31 మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు.

32 ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.