Psalm 98 in Telugu

1 ఒక కీర్తన. యెహోవాకు కొత్త పాట పాడండి. ఆయన అద్భుతాలు చేశాడు. ఆయన కుడి చెయ్యి, ఆయన పవిత్ర హస్తం మనకు విజయం తెచ్చాయి.

2 యెహోవా తన రక్షణను వెల్లడిచేశాడు. రాజ్యాలన్నిటికీ తన న్యాయాన్ని కనపరిచాడు.

3 అయన ఇశ్రాయేలు వంశం పట్ల తన నిబంధన విశ్వసనీయత, తన నమ్మకత్వం గుర్తు చేసుకున్నాడు. భూదిగంతాలు మన దేవుని విజయాన్ని చూస్తారు.

4 లోకమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయండి. ఉల్లాసంగా పాడండి. పాటలెత్తి ఆనందంగా పాడండి. ప్రస్తుతులు పాడండి.

5 తీగ వాయిద్యంతో యెహోవాకు ప్రశంసలు పాడండి. తీగ వాయిద్యంతో మధురంగా పాడండి.

6 బాకాలతో కొమ్ముబూర ధ్వనితో, రాజైన యెహోవా ఎదుట సంతోషంగా కేకలు వేయండి.

7 సముద్రం, దానిలో ఉన్నదంతా ఘోషిస్తుంది గాక. లోకం, దాని నివాసులు కేకలు వేస్తారు గాక!

8 నదులు చప్పట్లు కొట్టాలి. కొండలు ఆనందంతో కేకలు పెట్టాలి.

9 లోకానికి తీర్పు తీర్చడానికి, నీతితో ప్రపంచ ప్రజలందరికీ తీర్పు తీర్చడానికి యెహోవా రాబోతున్నాడు.