Psalm 95 in Telugu
1 రండి, యెహోవాకు పాట పాడదాం, మన రక్షణకు ఆధారశిలకు ఆనందంగా పాడదాం.
2 కృతజ్ఞతతో ఆయన సన్నిధికి వద్దాం, ఆయనకు స్తుతి గీతాలు పాడదాం.
3 యెహోవా గొప్ప దేవుడు. దేవుళ్ళందరికీ పైగా ఉన్న గొప్ప రాజు.
4 భూమి అగాధస్థలాలు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వత శిఖరాలు ఆయనవే.
5 సముద్రం ఆయనది. ఆయనే దాన్ని చేశాడు. ఆయన చేతులు పొడి నేలను చేశాయి.
6 రండి సాగిలపడి ఆరాధన చేద్దాం. మన సృష్టికర్త యెహోవా ఎదుట మోకరిల్లుదాం.
7 ఆయన మన దేవుడు. మనం ఆయన పోషించే ప్రజలం. ఆయన చేతికింది గొర్రెలం. ఈ రోజున మీరు ఆయన స్వరం వింటే ఎంత బాగుండు!
8 మెరీబా దగ్గర, ఎడారిలో మస్సా దగ్గర ఉన్న సమయంలో మీ పూర్వీకుల్లాగా మీ గుండె కఠినం చేసుకోవద్దు.
9 అక్కడ వాళ్ళు నా అధికారాన్ని సవాలు చేశారు నా కార్య కలాపాలు చూసి కూడా నా ఓపికను పరీక్షించారు.
10 నలభై ఏళ్ళు నేను ఆ తరం వారితో కోపంగా ఉన్నాను. వాళ్ళ హృదయాలు దారి తప్పుతున్నాయి. వాళ్ళు నా పద్ధతులు తెలుసుకోలేదు అన్నాను.
11 కాబట్టి, వాళ్ళు నా విశ్రాంతి స్థలంలో ఎన్నడూ ప్రవేశించరని నేను నా కోపంలో శపథం చేశాను.