Psalm 64 in Telugu

1 ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన దేవా, నేను మొర పెట్టినప్పుడు నా మనవి విను. నా శత్రువుల భయం నుండి నా ప్రాణాన్ని కాపాడు.

2 దుర్మార్గుల కుట్ర నుండి, దుష్టక్రియలు చేసేవారి అల్లరి నుండి నన్ను దాచిపెట్టు.

3 ఒకడు కత్తికి పదునుపెట్టేలా వారు తమ నాలుకలకు పదును పెడతారు. చేదు మాటలు అనే బాణాలను వారు ఎక్కుపెట్టారు.

4 నిరపరాధులను కొట్టాలని రహస్య స్థలాల్లో ఆ బాణాలు సంధిస్తారు. ఏమాత్రం భయపడకుండా వారు అకస్మాత్తుగా వారిని కొడతారు.

5 వారు దురాలోచనలు చేస్తూ తమను తాము ప్రోత్సాహపరచుకుంటారు. చాటుగా వల పన్నడానికి ఆలోచిస్తారు. మనలను ఎవరు చూస్తారులే అని చెప్పుకుంటారు.

6 వారు చెడ్డపనులు చేయడానికి కొత్త ప్రణాళికలు తయారు చేస్తారు. ఇది మంచి పన్నాగం, చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేశాం అని వారు చెప్పుకుంటారు. మానవుని హృదయంలోని ఆలోచనలు చాలా లోతైనవి.

7 దేవుడు వారిని బాణాలతో కొడతాడు. ఉన్నట్టుండి వారు గాయాల పాలవుతారు.

8 వారు కూలిపోతారు. దానికి కారణం వారి నాలుకలే. వారిని చూసిన వారంతా తలలు ఊపుతారు.

9 మనుషులంతా భయం కలిగి దేవుడు చేసిన పనులు ప్రకటిస్తారు. ఆయన కార్యాలను గూర్చి చక్కగా ఆలోచిస్తారు.

10 నీతిపరులు యెహోవాను బట్టి సంతోషిస్తూ ఆయనలో ఆశ్రయం పొందుతారు. యథార్థవంతులు ఆయనలో గర్విస్తారు.