Psalm 35 in Telugu

1 దావీదు కీర్తన యెహోవా, నాకు విరోధంగా పనులు చేస్తున్న వారికి విరోధంగా ఉండు. నాతో పోరాటం చేసే వాళ్ళతో నువ్వు పోరాటం చెయ్యి.

2 నీ చిన్న డాలునూ, నీ పెద్ద డాలునూ పట్టుకో. లేచి నాకు సహాయం చెయ్యి.

3 నన్ను తరిమే వాళ్ళకు విరోధంగా ఈటెనూ, గొడ్డలినీ ప్రయోగించు. నీ రక్షణ నేనే అని నాకు అభయమివ్వు.

4 నా ప్రాణం తీయాలని చూసేవాళ్ళు సిగ్గుపడి అవమానం పాలవుతారు గాక! నాకు హాని చేయాలని చూసే వాళ్ళు వెనక్కి తగ్గి గందరగోళానికి గురౌతారు గాక!

5 యెహోవా దూత వాళ్ళను తరుముతుంటే వాళ్ళు వీస్తున్న గాలి ఎదుట ఎగిరిపోయే పొట్టులాగా ఉంటారు గాక!

6 యెహోవా దూత వాళ్ళను తరుముతుంటే వాళ్ళు వెళ్ళే దారి చీకటిగానూ జారుడుగానూ ఉంటుంది గాక!

7 కారణం లేకుండానే వాళ్ళు నన్ను పట్టుకోడానికి వల వేశారు. కారణం లేకుండానే వాళ్ళు నా ప్రాణం తీయాలని నా కోసం గుంట తవ్వారు.

8 వాడి పైకి వాడికి తెలియకుండా వాణ్ణి విస్మయానికి గురి చేస్తూ నాశనం రానీ. వాళ్ళు వేసిన వలలో వాళ్ళనే పడనీ. తమ స్వనాశనం కోసం వాళ్ళనే దానిలో పడనీ.

9 అయితే నేను యెహోవాలో ఆనందిస్తూ ఉంటాను. ఆయన ఇచ్చే రక్షణలో సంతోషిస్తూ ఉంటాను.

10 అప్పుడు నా శక్తి అంతటితో నేనిలా అంటాను. యెహోవా, నువ్వు అణచివేతకు గురైన వాళ్ళను బలవంతుల చేతిలో నుండీ, పేదలనూ, అవసరార్థులనూ దోచుకునే వాళ్ళ చేతిలో నుండీ విడిపిస్తావు. నీలాటి వారెవరు?

11 అధర్మపరులైన సాక్షులు బయల్దేరుతున్నారు. వాళ్ళు నాపై అసత్య నిందలు వేస్తున్నారు.

12 నేను వాళ్లకు చేసిన మంచికి బదులుగా వాళ్ళు నాకు చెడు చేస్తున్నారు. నాకు విచారంగా ఉంది.

13 అయితే వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె గుడ్డ ధరించాను. నా తల వాల్చి వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నాను.

14 అతడు నాకు సోదరుడైనట్టుగా వేదన పడ్డాను. నా తల్లి కోసం అయినట్టుగా కుంగిపోయాను.

15 కాని నా అడుగులు తడబడినప్పుడు వాళ్ళంతా గుమికూడి సంతోషించారు. నాకు వ్యతిరేకంగా వాళ్ళంతా కలిశారు. కానీ నాకు ఆ సంగతి తెలియలేదు. ఆపకుండా అదే పనిగా వాళ్ళు నన్ను నిందించారు.

16 గౌరవం ఏమీ లేకుండా వాళ్ళు నన్ను ఎత్తి పొడిచారు. నన్ను చూస్తూ పళ్ళు కొరికారు.

17 ప్రభూ, నువ్వు ఇక ఎంతకాలం చూస్తూ ఉంటావు? నీవెన్నాళ్లు చూస్తూ ఊరకుంటావు? వాళ్ళ విధ్వంసకరమైన దాడుల నుండి నన్ను కాపాడు. సింహాల నుండి నా ప్రాణాన్ని రక్షించు.

18 అప్పుడు నేను మహాసమాజంలో నీకు కృతఙ్ఞతలు చెప్పుకుంటాను. అనేకమంది జనాలున్న చోట నిన్ను స్తుతిస్తాను.

19 నా విషయంలో నా శత్రువులు అన్యాయంగా సంతోష పడేలా చేయకు. వాళ్ళ దుర్మార్గపు ప్రణాళికలను అమలు చెయ్యనీయకు.

20 వాళ్ళు శాంతిని గూర్చి మాట్లాడరు. దేశంలో ప్రశాంతంగా జీవిస్తున్న వాళ్లకు విరోధంగా మోసపూరితమైన మాటలు కల్పిస్తారు.

21 నన్ను నిందించడానికి తమ నోళ్ళు బాగా తెరిచారు. ఆహా, మా కళ్ళకు వాడు చేసింది కనిపించిందిలే, అంటున్నారు.

22 యెహోవా, నువ్వు చూస్తున్నావు. మౌనంగా ఉండకు. ప్రభూ, నాకు దూరంగా ఉండకు.

23 నా దేవా, నా ప్రభూ, నా పక్షంగా వాదించడానికి లే. లేచి నాకు న్యాయం తీర్చు.

24 యెహోవా, నా దేవా, నీ నీతిని బట్టి నా పక్షం వహించు. నా విషయంలో వాళ్ళను సంతోషపడనియ్యకు.

25 వాళ్ళు తమ మనస్సుల్లో ఆహా, మేము కోరుకున్నట్టే జరిగింది అని చెప్పే అవకాశం ఇవ్వకు. మేము వాణ్ణి మింగేశాం, అని చెప్పనివ్వకు.

26 వాళ్ళను అవమానానికి గురి చెయ్యి. నాకు హాని తలపెట్టే వాళ్ళను చిందరవందర చెయ్యి. నాకు వ్యతిరేకంగా వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు అవమానానికీ, అగౌరవానికీ గురౌతారు గాక!

27 నా నిర్దోషత్వం రుజువు కావాలని కోరుకునే వాళ్ళు ఆనందంతో కోలాహలం చేస్తూ సంతోషిస్తారు గాక! తన సేవకుడి సంక్షేమం చూసి ఆనందించే యెహోవాకు వాళ్ళు నిత్యం స్తుతులు చెల్లిస్తారు గాక!

28 అప్పుడు నేను నీ న్యాయాన్ని గూర్చి ప్రచారం చేస్తాను. దినమంతా నిన్ను స్తుతిస్తూ ఉంటాను.