Numbers 21 in Telugu

1 ఇశ్రాయేలీయులు అతారీం మార్గంలో వస్తున్నారని దక్షిణం వైపు నివాసం ఉన్న కనానీయుడైన అరాదు రాజు విని, అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి వారిల్లో కొంతమందిని బందీలుగా పట్టుకున్నాడు.

2 ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకుని “నువ్వు మాకు ఈ జనం మీద జయం ఇస్తే, మేము నీ పేరట వారి పట్టణాలు పూర్తిగా నాశనం చేస్తాం” అన్నారు.

3 యెహోవా ఇశ్రాయేలీయుల స్వరం విని, ఆ కనానీయుల మీద వాళ్లకు జయం ఇచ్చాడు. అప్పుడు వారు ఆ కనానీయులను, వారి పట్టణాలను పూర్తిగా నాశనం చేశారు. ఆ చోటికి “హోర్మా” అని పేరు.

4 ఆ తరువాత వారు ఎదోము చుట్టూ తిరిగి వెళ్లాలని, హోరు కొండనుంచి ఎర్ర సముద్రం దారిలో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో అలసటతో ప్రజలు సహనం కోల్పోయారు.

5 అప్పుడు ప్రజలు దేవునికి, మోషేకి విరోధంగా మాట్లాడుతూ “ఈ నిర్జన బీడు ప్రాంతంలో చావడానికి ఐగుప్తులోనుంచి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, ఈ నికృష్టమైన భోజనం మాకు అసహ్యం” అన్నారు.

6 అప్పుడు యెహోవా ప్రజల్లోకి విషసర్పాలు పంపించాడు. అవి ప్రజలను కాటువేసినప్పుడు ఇశ్రాయేలీయుల్లో చాలామంది చనిపోయారు.

7 కాబట్టి ప్రజలు మోషే దగ్గరికి వచ్చి “మేము యెహోవాకు, నీకు విరోధంగా మాట్లాడి పాపం చేశాం. యెహోవా మా మధ్యనుంచి ఈ సర్పాలు తొలగించేలా ఆయనకు ప్రార్ధించండి” అన్నారు.

8 మోషే ప్రజల కోసం ప్రార్థన చేసినప్పుడు యెహోవా “పాము ఆకారం చేయించి స్థంభం మీద పెట్టు. అప్పుడు పాము కాటేసిన ప్రతి వాడు దానివైపు చూసి బతుకుతాడు” అని మోషేకు చెప్పాడు.

9 కాబట్టి మోషే, ఇత్తడి పాము ఒకటి చేయించి, స్థంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు పాము కాటు తిన్న ప్రతివాడూ ఆ ఇత్తడి పాము వైపు చూసినప్పుడు అతడు బతికాడు.

10 తరువాత ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి ఓబోతులో శిబిరం వేసుకున్నారు.

11 ఓబోతులోనుంచి వారు ప్రయాణం చేసి తూర్పు వైపు, అంటే మోయాబుకు ఎదురుగా ఉన్న బంజరు భూమి ఈయ్యె అబారీము దగ్గర శిబిరం వేసుకున్నారు.

12 అక్కడనుంచి వారు ప్రయాణం చేసి, జెరెదు లోయలో శిబిరం వేసుకున్నారు.

13 అక్కడనుంచి వారు ప్రయాణం చేసి బంజరు భూమిలో అర్నోను నది అవతల శిబిరం వేసుకున్నారు. ఆ నది అమోరీయుల దేశ సరిహద్దులనుంచి ప్రవహిస్తుంది. అర్నోను నది మోయాబుకు, అమోరీయులకు మధ్య ఉన్న మోయాబు సరిహద్దు.

14 ఆ కారణంగా యెహోవా యుద్ధాల గ్రంథంలో “సుఫాలో ఉన్న వాహేబు, అర్నోను లోయలు, ఆరు అనే స్థలం వరకూ ఉన్న అర్నోను లోయలు,

15 మోయాబు సరిహద్దుకు దగ్గరగా ఉన్న పల్లపు లోయలు” అని రాసి ఉంది.

16 అక్కడనుంచి వారు బెయేరుకు వెళ్ళారు. అక్కడ ఉన్న బావి దగ్గర యెహోవా మోషేతో “ప్రజలను సమకూర్చు. నేను వాళ్లకు నీళ్ళు ఇస్తాను” అన్నాడు.

17 అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడారు. “బావీ, పైకి ఉబుకు! ఆ బావిని కీర్తించండి. నాయకులు దాన్ని తవ్వారు.

18 వారు తమ అధికార దండంతో, చేతికర్రలతో ప్రజల నాయకులు దాన్ని తవ్వారు.”

19 వారు ఆ ఎడారిలోనుంచి మత్తానుకూ, మత్తానునుంచి నహలీయేలుకూ, నహలీయేలునుంచి బామోతుకూ,

20 మోయాబు దేశంలోని లోయలో ఉన్న బామోతు నుంచి ఎడారికి ఎదురుగా ఉన్న పిస్గా కొండ దగ్గరికి వచ్చారు.

21 ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను దగ్గరికి రాయబారులను పంపించి “మమ్మల్ని నీ దేశం గుండా వెళ్లనివ్వు,

22 మేము పొలాల్లోకైనా, ద్రాక్షతోటల్లోకైనా వెళ్ళం. బావుల్లో నీళ్లు తాగం. మేము నీ సరిహద్దులు దాటే వరకూ రాజమార్గంలోనే నడిచి వెళ్తాం” అని అతనితో చెప్పించారు.

23 కాని, సీహోను ఇశ్రాయేలీయులను తన సరిహద్దుల గుండా వెళ్ళనివ్వ లేదు. ఇంకా సీహోను తన జనమంతా సమకూర్చుకుని ఇశ్రాయేలీయుల మీద దాడి చెయ్యడానికి ఎడారిలోకి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు.

24 ఇశ్రాయేలీయులు అతన్ని కత్తితో హతం చేసి, అతని దేశం అర్నోను మొదలు యబ్బోకు వరకూ, అంటే అమ్మోనీయుల దేశం వరకూ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అమ్మోనీయుల సరిహద్దు బలోపేతం అయ్యింది.

25 ఇశ్రాయేలీయులు ఆ పట్టాణాలన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టాణాలన్నిట్లో, హెష్బోనులో, దాని పల్లెలన్నిట్లో శిబిరం వేసుకున్నారు.

26 హెష్బోను, అమోరీయుల రాజైన సీహోను పట్టణం. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధం చేసి అర్నోను వరకూ అతని దేశమంతా స్వాధీనం చేసుకున్నాడు.

27 కాబట్టి సామెతలు పలికే వారు “హెష్బోనుకు రండి. సీహోను పట్టణం కట్టాలి, దాన్ని స్థాపించాలి,

28 హెష్బోనునుంచి అగ్ని బయలువెళ్ళింది, సీహోను పట్టణంనుంచి జ్వాలలు బయలువెళ్ళాయి, అది మోయాబుకు ఆనుకున్న ఆరు దేశాన్ని కాల్చేసింది, అర్నోను ఉన్నత స్థలాల యజమానులను కాల్చేసింది.

29 మోయాబూ, నీకు బాధ, కెమోషు ప్రజలారా, మీరు నశించారు. తన కొడుకులను పలాయనం అయ్యేలా, తన కూతుళ్ళను అమోరీయులరాజైన సీహోనుకు బందీలుగా చేశాడు.

30 కాని మేము సీహోనును జయించాం. దీబోను వరకూ హెష్బోను నాశనం అయ్యింది. నోఫహు వరకూ దాన్ని పాడుచేశాం. అగ్నితో మేదెబా వరకూ తగల బెట్టాం” అంటారు.

31 కాబట్టి ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశంలో నివాసం ఉండడం ఆరంభించారు.

32 అప్పుడు, యాజెరు దేశాన్ని సంచారం చేసి చూడడానికి మోషే మనుషులను పంపినప్పుడు వారు దాని గ్రామాలు స్వాధీనం చేసుకుని అక్కడున్న అమోరీయులను తోలి వేశారు.

33 వారు తిరిగి బాషాను మార్గంలో ముందుకు వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగు, అతని జనమంతా ఎద్రెయీలో యుద్ధం చెయ్యడానికి బయలుదేరారు.

34 యెహోవా మోషేతో “అతనికి భయపడొద్దు. నేను అతని మీద, అతని జనం మీద, అతని దేశం మీద నీకు విజయం ఇచ్చాను. నువ్వు హెష్బోనులో నివాసం ఉన్న అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్టు ఇతనికి కూడా చేస్తావు” అన్నాడు.

35 కాబట్టి వారు అతన్ని, అతని కొడుకులను, ఒక్కడు కూడా మిగలకుండా అతని జనం అంతటినీ హతం చేసి అతని దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.