Mark 16 in Telugu

1 విశ్రాంతి దినం అయిపోగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ, సలోమి కలిసి వెళ్ళి యేసు దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు.

2 ఆదివారం ఉదయం తెల్లవారుతూ ఉండగా వారు యేసు సమాధి దగ్గరికి వస్తూ,

3 “మన కోసం సమాధిని మూసిన ఆ రాయిని ఎవరు దొర్లిస్తారు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

4 వారు వచ్చి సమాధికేసి చూడగా ఆ పెద్ద రాయి పక్కకి దొర్లించి ఉంది.

5 వారు ఆ సమాధిలోకి వెళ్ళి తెల్లటి దుస్తులు ధరించిన ఒక యువకుడు కుడి పక్కన కూర్చుని ఉండడం చూశారు. అది చూసి వారు నిర్ఘాంతపోయారు.

6 అతడు వారితో ఇలా అన్నాడు, “భయపడకండి! మీరు వెతుకుతున్నది సిలువ మరణం పొందిన నజరేతువాడైన యేసును. ఆయన తిరిగి బతికాడు. ఇక్కడ లేడు. ఇదిగో ఆయనను ఉంచిన స్థలం ఇదే.

7 మీరు వెళ్ళి ఆయన శిష్యులతో, పేతురుతో ఇలా చెప్పండి. “యేసు మీకంటే ముందుగా గలిలయకి వెళ్తున్నాడు. ఆయన ముందుగానే చెప్పినట్టు మీరు ఆయనను అక్కడ చూస్తారు.”

8 ఆ స్త్రీలు భయపడుతూ, వణుకుతూ, ఆ సమాధి నుండి పరుగెత్తి వెళ్ళిపోయారు. వారు భయం వల్ల తమలో తాము ఏమీ మాట్లాడుకోలేదు.

9 వారం మొదటి రోజు ఆదివారం తెల్లవారుతూ ఉండగా యేసు లేచి, తాను ఏడు దయ్యాలను వదిలించిన మగ్దలేనే మరియకు మొట్టమొదట కనిపించాడు.

10 ఆమె, యేసుతో కలిసి ఉన్న వారి దగ్గరికి వెళ్ళింది. వారు దుఃఖిస్తూ, విలపిస్తూ ఉన్నారు. అప్పుడు ఆమె యేసు తిరిగి లేచిన సంగతి వారికి చెప్పింది.

11 యేసు మళ్ళీ బతికాడనీ, తాను ఆయనను చూశాననీ చెప్పింది. కాని, వారు ఆమె మాటలు నమ్మలేదు.

12 ఆ తరువాత వారిలో ఇద్దరు శిష్యులు వారి గ్రామానికి నడిచి వెళ్తూ ఉండగా ఆయన వారికి వేరే రూపంలో కనిపించాడు.

13 వారు తిరిగి వెళ్ళి మిగిలిన వారికి ఆ సంగతి చెప్పారు గానీ వారు నమ్మలేదు.

14 ఆ తరువాత పదకొండు మంది శిష్యులు భోజనం చేస్తూ ఉండగా యేసు వారికి కనిపించాడు. తాను తిరిగి బతికిన విషయం కొందరు చెప్పినా శిష్యులు నమ్మలేదు కాబట్టి వారి అపనమ్మకం, హృదయ కాఠిన్యం బట్టి వారిని గద్దించాడు.

15 యేసు వారితో ఇలా అన్నాడు, “మీరు సర్వ లోకానికీ వెళ్ళి సృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి.

16 దాన్ని నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు. నమ్మని వారు శిక్ష అనుభవిస్తారు.

17 “నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి, వారు నా పేరిట దయ్యాలను వెళ్ళగొడతారు. కొత్త భాషలు మాట్లాడతారు.

18 తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు. విషం తాగినా వారికి ఏ హానీ కలగదు. వారు రోగుల మీద తమ చేతులు ఉంచినప్పుడు రోగులు బాగుపడతారు.”

19 ప్రభు యేసు వారితో మాట్లాడిన తరవాత దేవుడు ఆయనను పరలోకంలోకి స్వీకరించాడు. అక్కడ యేసు దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు.

20 ఆ తరువాత శిష్యులు బయలుదేరి అన్ని ప్రాంతాలకూ వెళ్ళి యేసును ప్రకటించారు. ప్రభువు వారికి తోడై, వారు ప్రకటించిన సందేశం సత్యమని సూచనల ద్వారా, అద్భుతాల ద్వారా స్థిరపరిచాడు.