Mark 14 in Telugu

1 రెండు రోజుల తరువాత పస్కా పండగ, పొంగని రొట్టెల పండగ రాబోతున్నాయి. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు యేసును రహస్యంగా బంధించి చంపాలని కుట్రలు పన్నుతున్నారు.

2 అయితే ప్రజల్లో అల్లరి జరగవచ్చు అని భయపడి, పండగ సమయంలో వద్దు అని చెప్పుకున్నారు.

3 ఆ సమయంలో యేసు బేతనీలో కుష్టురోగి సీమోను ఇంట్లో భోజనానికి కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఒక స్త్రీ అగరు చెట్ల నుండి చేసిన స్వచ్ఛమైన, ప్రశస్తమైన అత్తరును ఒక చలువరాతి సీసాలో తన వెంట తెచ్చింది. ఆమె ఆ సీసా పగలగొట్టి ఆ అత్తరును యేసు తల మీద పోసింది.

4 అయితే ఇది చూసి అక్కడ ఉన్న కొందరు కోపం తెచ్చుకున్నారు. వారు, “అత్తరు ఇలా వృధా చేయడం ఎందుకు?

5 ఈ అత్తరు అమ్మి ఉంటే మూడువందల దేనారాల కంటే ఎక్కువే వచ్చేవి. ఆ డబ్బు పేదవాళ్ళకు ఇచ్చి ఉండవలసింది” అని తమలో తాము చెప్పుకుని ఆ స్త్రీని గద్దించారు.

6 అయితే యేసు, “ఆమె జోలికి వెళ్ళకండి! ఆమెను ఎందుకు కంగారు పెడుతున్నారు? ఈమె నా విషయంలో శ్రేష్ఠమైన పని చేసింది.

7 పేదవారు ఎప్పుడూ మీతో ఉంటారు. మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు వారికి సహాయం చేయవచ్చు. కాని, నేను ఎల్లకాలం మీతో ఉండను.

8 ఈమె తాను చేయగలిగింది చేసింది. ఈమె నా శరీరాన్ని భూస్థాపన కోసం ముందుగా అభిషేకించింది.

9 మీతో నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ లోకమంతటా సువార్త ప్రకటన జరిగే ప్రతిచోటా ఈమె చేసినది కూడా జ్ఞాపకం చేసుకుని ప్రశంసిస్తారు” అన్నాడు.

10 ఆ తరువాత పన్నెండు మందిలో ఒకడైన యూదా ఇస్కరియోతు యేసును పట్టి ఇచ్చేందుకు ప్రధాన యాజకులతో మాట్లాడడానికి వారి దగ్గరికి వెళ్ళాడు.

11 అది విని వారు చాలా సంతోషించి అతనికి కొంత సొమ్ము ముట్టజెపుతామని మాట ఇచ్చారు. అప్పటినుండీ యేసును వారికి అప్పగించడానికి తగిన అవకాశం కోసం యూదా ఎదురు చూస్తూ ఉన్నాడు.

12 పొంగని రొట్టెల పండగ మొదటి రోజున పస్కా గొర్రె పిల్లను వధించే రోజు వచ్చినప్పుడు యేసు శిష్యులు, “పస్కా విందును ఎక్కడ సిద్ధం చేయమంటావు?” అని ఆయనను అడిగారు.

13 యేసు తన శిష్యుల్లో ఇద్దరిని పంపుతూ, “మీరు ఊళ్ళోకి వెళ్ళండి. నీళ్ళ కుండ మోస్తున్న ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు. అతని వెంట వెళ్ళండి.

14 అతడు ఏ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కాను తినడానికి విడిది గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడుగుతున్నాడు’ అని చెప్పండి.

15 అతడు పూర్తి సామగ్రితో సిద్ధంగా ఉన్న విశాలమైన మేడ గది మీకు చూపిస్తాడు. మన కోసం అక్కడ పస్కా విందు ఏర్పాటు చేయండి” అని ఆదేశించాడు.

16 ఆ శిష్యులు బయలుదేరి నగరంలోకి వెళ్ళారు. ఆయన తమతో చెప్పినట్టే అన్నీ జరిగాయి. వారు పస్కా పండగ భోజనం సిద్ధం చేశారు.

17 సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో అక్కడికి వచ్చాడు.

18 వారంతా బల్ల దగ్గర కూర్చుని భోజనం చేస్తుండగా యేసు, “మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, నాతో కలిసి భోజనం చేస్తూ ఉన్న మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు” అన్నాడు.

19 వారికి దుఃఖం కలిగింది. ఒకరి తరవాత ఒకరు ఆయనతో, “నేను కాదు కదా!” అన్నారు.

20 ఆయన వారితో, “అతడు ఈ పన్నెండు మందిలో ఒకడు, నాతో కలసి పాత్రలో చెయ్యి ముంచేవాడే!

21 ఎందుకంటే మనుష్య కుమారుడి గురించి రాసి ఉన్నట్టే ఆయన చనిపోతాడు గాని, ఆయనను శత్రువులకు అప్పగించిన వాడికి శిక్ష తప్పదు. వాడు పుట్టకపోతే బాగుండేది” అన్నాడు.

22 వారు భోజనం చేస్తూ ఉండగా యేసు రొట్టె తీసుకుని ఆశీర్వదించి, దాన్ని విరిచి వారికిచ్చి, “దీన్ని తీసుకుని తినండి. ఇది నా దేహం” అన్నాడు.

23 తరువాత ఒక పాత్ర తీసుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వారికి ఇచ్చాడు. ఆ పాత్రలోనిది వారందరూ తాగారు.

24 ఆయన వారితో, “ఇది నా రక్తం. అనేకుల కోసం చిందే నిబంధన రక్తం.

25 నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి, కొత్త ద్రాక్షారసం మళ్ళీ తాగే రోజు వరకూ ఇక నేను దాన్ని తాగను అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను” అన్నాడు.

26 అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవల కొండకి వెళ్ళారు.

27 అప్పుడు యేసు వారితో, “ఈ రాత్రి నా విషయంలో మీరంతా నాకు ముఖం చాటేస్తారు. ఎందుకంటే లేఖనాల్లో ఇలా ఉంది, ‘కాపరిని కొడతాను, గొర్రెలు చెదరిపోతాయి.’

28 కాని నేను తిరిగి సజీవంగా లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకి వెళ్తాను” అని చెప్పాడు.

29 అయితే పేతురు ఆయనతో, “అందరూ అలా చేసినా నేను మాత్రం నిన్ను విడిచి పెట్టను” అన్నాడు.

30 అప్పుడు యేసు, “నీతో కచ్చితంగా చెప్పేదేమిటంటే ఈ రాత్రి కోడి రెండు సార్లు కూయక ముందే నీవు మూడు సార్లు నేనెవరో తెలియదని అబద్ధం ఆడతావు” అని అతనితో అన్నాడు.

31 “నేను నీతో చావవలసి వచ్చినా నువ్వు తెలియదు అనను” అని పేతురు గట్టిగా చెప్పాడు. మిగిలిన శిష్యులు కూడా అదే విధంగా అన్నారు.

32 అందరూ గేత్సేమనే అనే చోటికి వెళ్ళారు. అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థన చేసి వచ్చే వరకూ మీరు ఇక్కడే ఉండండి” అన్నాడు.

33 అప్పుడాయన పేతురు, యాకోబు, యోహానులను తన వెంట తీసుకు వెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, నిస్పృహలో మునిగిపోసాగాడు.

34 ఆయన వారితో, “ప్రాణం పోయేటంత దుఃఖంలో మునిగి ఉన్నాను. మీరు ఇక్కడే నిలిచి మెలకువగా ఉండండి” అని చెప్పి,

35 ఇంకా కొంత ముందుకు వెళ్ళి నేల మీద పడి, సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటిపోవాలని ప్రార్థన చేశాడు.

36 ఆయన, “అబ్బా! తండ్రీ! నీకు అన్నీ సాధ్యమే. ఈ గిన్నెను నా నుంచి తొలగించు. కాని నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగనివ్వు” అని ప్రార్థించాడు.

37 ఆయన వచ్చి తన శిష్యులు నిద్రపోతూ ఉండడం చూసి, “సీమోనూ! నిద్రపోతున్నావా? ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేకపోయావా?

38 మీరు పరీక్షకు గురి కాకుండా ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది” అన్నాడు.

39 ఆయన మళ్ళీ వెళ్ళి ఇంతకు ముందు పలికిన మాటలే పలుకుతూ ప్రార్థించాడు.

40 ఆయన తిరిగి వచ్చి వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. ఆయనకు ఏమి జవాబు చెప్పాలో శిష్యులకు తోచలేదు.

41 మూడవ సారి ఆయన వచ్చి వారితో ఇలా అన్నాడు, “మీరింకా నిద్రపోతూ ఉన్నారా? ఇక చాలు. ఆ సమయం వచ్చింది. ఇదిగో చూడండి. మనుష్య కుమారుణ్ణి పాపులు బంధించబోతున్నారు.

42 వెళ్దాం రండి. నన్ను అప్పగించబోతున్న వాడు దగ్గరలోనే ఉన్నాడు.”

43 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మందిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలూ పంపిన పెద్ద గుంపు అతనితో ఉంది. వారి దగ్గర కత్తులూ దుడ్డు కర్రలూ ఉన్నాయి.

44 ఆయనను అప్పగించేవాడు ముందుగానే వారికి ఒక గుర్తు చెప్పి, “నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఆయనను బంధించి తీసుకు వెళ్ళండి” అన్నాడు.

45 అతడు అక్కడికి చేరిన వెంటనే యేసు దగ్గరికి వచ్చి, “రబ్బీ!” అంటూ ఆయనను ముద్దుపెట్టుకున్నాడు.

46 అప్పుడు వారు యేసు మీద పడి గట్టిగా పట్టుకున్నారు.

47 అక్కడ నిలుచున్న వారిలో ఒకడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని కొట్టి అతని చెవి నరికి వేశాడు.

48 యేసు వారితో ఇలా అన్నాడు, “మీరు కత్తులతో గదలతో వచ్చి బంధించడానికి నేను దోపిడీ దొంగనా?

49 నేను ప్రతి రోజూ దేవాలయంలో ఉపదేశం చేస్తూ మీతో ఉన్నవాడినే కదా! అప్పుడు నన్ను ఎందుకు పట్టుకోలేదు? లేఖనాల్లో రాసి ఉన్నది నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది.”

50 అప్పుడు యేసు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు.

51 ఒక యువకుడు యేసును వెంబడిస్తున్నాడు. అతని శరీరం మీద నారబట్ట తప్ప ఇంకేమీ లేదు. వారు అతనిని కూడా పట్టుకున్నారు.

52 కాని అతడు ఆ నారబట్ట విడిచిపెట్టి నగ్నంగా పారిపోయాడు.

53 వారు యేసుని ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకు వెళ్ళారు. అక్కడ ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు అందరూ సమావేశమయ్యారు.

54 పేతురు యేసుకు దూరంగా ఉండి వెంబడిస్తూ ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలోకి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా కూర్చుని మంట దగ్గర చలి కాచుకుంటూ ఉన్నాడు.

55 ముఖ్య యాజకులు, యూదుల మహా సభలోని సభ్యులంతా యేసుకు మరణశిక్ష విధించడానికి తగిన సాక్ష్యం కోసం చూస్తూ ఉన్నారు గానీ అది వారికి దొరకలేదు.

56 చాలామంది యేసుకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పారు. కాని, వారి సాక్షాలు ఒకదానితో ఒకటి పొసగలేదు.

57 అప్పుడు కొందరు లేచి ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెబుతూ,

58 “ఇతడు ‘మనుషులు కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మనుషులు కట్టని మరో దేవాలయాన్ని నిర్మిస్తాను’ అని చెప్పడం మేము విన్నాం” అన్నారు.

59 కాని, వారి సాక్ష్యం కూడా ఒకరితో ఒకరికి పొసగలేదు.

60 అప్పుడు ప్రధాన యాజకుడు లేచి అందరి సమక్షంలో యేసుతో, “నీవేమీ మాట్లాడవేంటి? వీరు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా!” అని యేసును ప్రశ్నించాడు.

61 కాని యేసు మౌనం వహించాడు. ప్రధాన యాజకుడు, “నీవు దేవుని కుమారుడివైన క్రీస్తువా?” అని మళ్ళీ యేసును ప్రశ్నించాడు.

62 అప్పుడు యేసు, “నేనే. మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి వైపున కూర్చుని ఉండటం, పరలోకం నుండి మేఘాలపై రావడం మీరు చూస్తారు” అన్నాడు.

63 ప్రధాన యాజకుడు తన బట్టలు చింపుకుని, “ఇంకా మనకు సాక్షాలతో ఏం పని?

64 ఇతడు దేవ దూషణ చేయడం మీరు విన్నారు కదా! మీరేమంటారు?” అన్నాడు. ఆయన మరణశిక్షకు తగిన వాడని అందరూ తీర్పు చెప్పారు.

65 అప్పుడు కొందరు యేసు మీద ఉమ్మివేసి, ఆయన కళ్ళకు గంతలు కట్టి, ఆయనను గుద్ది, “ఎవరో ప్రవచించు” అన్నారు. భటులు కూడా ఆయనను కొట్టారు.

66 పేతురు ఇంటి లోగిట్లో ఉన్నాడు. ప్రధాన యాజకుని పనిపిల్ల అక్కడకు వచ్చింది.

67 పేతురు చలి కాచుకుంటూ అక్కడ ఉండడం చూసి, “నజరేతు వాడైన యేసుతో నువ్వు కూడా ఉన్నావుగదా!” అని అతనితో అంది.

68 పేతురు కాదన్నాడు. “నేను ఆయనను ఎరగను. నీవేం అంటున్నావో నాకు అర్థం కావడం లేదు” అని అన్నాడు. ఆ వెంటనే లేచి ఆవరణలోకి వెళ్ళాడు. వెంటనే కోడి కూసింది.

69 ఆ పనిపిల్ల పేతురును చూసి, చుట్టూ ఉన్న వారితో, “ఇతడు వారిలో ఒకడు” అంది.

70 పేతురు మళ్ళీ కాదన్నాడు. కాసేపటికి పక్కన నిలుచున్నవారు అతనితో, “నిజమే! నువ్వు వాళ్ళలో ఒకడివే. ఎందుకంటే నువ్వు కూడా గలిలయ వాడివే కదా!” అన్నారు.

71 అయితే పేతురు, “మీరు మాట్లాడుతున్న మనిషి ఎవరో తెలియదు” అంటూ తనను తాను శపించుకోవడం, ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడు.

72 వెంటనే రెండోసారి కోడి కూసింది. ‘కోడి రెండు సార్లు కూసే ముందే నన్నెరుగనని మూడు సార్లు బొంకుతావు’ అని యేసు తనతో చెప్పిన మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి. అతడు దుఃఖం ఆపుకోలేక ఏడ్చాడు.