Leviticus 11 in Telugu
1 ఆ తరువాత యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పాడు.
2 “మీరు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పండి. భూమి పై ఉన్న జంతువులన్నిటిలో మీరు తినదగ్గవి ఇవి.
3 చీలిన డెక్కలు ఉండి ఏ జంతువు అయితే నెమరు వేస్తుందో ఆ జంతువుని మీరు ఆహారంగా తీసుకోవచ్చు.
4 అయితే జంతువుల్లో కొన్ని నెమరు వేస్తాయి. కొన్నిటికి చీలిన డెక్కలుంటాయి. ఇలాంటి వాటిని మీరు ఆహారంగా తీసుకోకూడదు. ఒంటె లాంటి జంతువులు నెమరు వేస్తాయి. కానీ దానికి చీలిన డెక్కలుండవు. కాబట్టి ఒంటెను మీరు అపవిత్రంగా ఎంచాలి.
5 పొట్టి కుందేలు నెమరు వేస్తుంది, కానీ దానికి చీలిన డెక్కలు లేవు. కాబట్టి దాన్ని కూడా మీరు అపవిత్రంగా ఎంచాలి.
6 అలాగే కుందేలు నెమరు వేస్తుంది. కానీ దానికి చీలిన డెక్కలు లేవు. కాబట్టి దాన్ని కూడా మీరు అపవిత్రంగా ఎంచాలి.
7 ఇక పందికి చీలిన డెక్కలు ఉన్నాయి. కానీ అది నెమరు వేయదు కాబట్టి దాన్ని మీరు అపవిత్రంగా ఎంచాలి.
8 వీటి మాంసాన్ని మీరు తినకూడదు. వాటి కళేబరాలను అంటుకోకూడదు. అవి మీకు అపవిత్రం.
9 జలచరాల్లో వీటిని తినవచ్చు. సముద్రంలోనైనా, నదిలో నైనా నీటిలో నివసించే అన్ని రకాల జీవుల్లో రెక్కలూ, పొలుసులూ ఉన్న వాటిని మీరు తినవచ్చు.
10 సముద్రంలోనైనా, నదిలో నైనా నీటిలో కదిలే అన్ని రకాల జీవుల్లోనూ, జల జంతువుల్లోనూ రెక్కలూ, పొలుసులూ లేని వాటిని మీరు అసహ్యించుకోవాలి.
11 అవి మీకు అసహ్యం కాబట్టి వాటి మాంసం మీరు తినకూడదు. వాటి కళేబరాలను అసహ్యించుకోవాలి.
12 నీళ్లలో దేనికి రెక్కలూ, పొలుసులూ ఉండవో అది మీకు అసహ్యం.
13 పక్షుల్లో మీరు అసహ్యించుకోవాల్సినవీ, తినకూడనివీ ఏవంటే, గద్ద, రాబందు,
14 గరుడ పక్షి, డేగ జాతిలో ప్రతి పక్షీ,
15 కాకి జాతిలోని ప్రతి పక్షీ,
16 కొమ్ముల గుడ్లగూబ, తీతువు పిట్ట, సముద్రపు కొంగ, గద్ద జాతిలో అన్ని పక్షులూ.
17 ఇంకా పైగిడి కంటె, గుడ్లగూబ, సముద్రపు డేగ,
18 తెల్ల గుడ్లగూబ, క్షేత గుడ్లగూబ, సముద్రపు రాబందు,
19 కొక్కిరాయి, అన్ని రకాల కొంగలు, కుకుడు గువ్వ, గబ్బిలం.
20 రెక్కలు ఉండి నాలుగుకాళ్లతో నడిచే జీవులన్నీ మీకు అసహ్యంగా ఉండాలి.
21 అయితే రెక్కలు ఉండి నలుగు కాళ్ళతో నడిచే, ఎగరగలిగే జీవులు, నేలపై గంతులు వేయడానికి తొడలు గల పురుగులన్నిటినీ మీరు తినవచ్చు.
22 అన్ని రకాల మిడతలను మీరు తినవచ్చు. ఆకు మిడత, కీచురాయి, గడ్డి మిడత ఇలా అన్ని రకాల మిడతలను మీరు తినవచ్చు.
23 అయితే నాలుగు కాళ్లు గల ఎగిరే తక్కిన జీవులన్నీ మీకు అసహ్యంగా ఉండాలి.
24 వీటిలో దేని కళేబరాన్ని అయినా మీరు తాకితే మీరు సాయంత్రం వరకూ అపవిత్రంగా ఉంటారు.
25 ఎవరైనా వాటి కళేబరాల్లో దేన్ని అయినా మోస్తే అలాంటి వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. వాడు సాయంకాలం వరకూ అపవిత్రంగా ఉంటాడు.
26 రెండు డెక్కలు గల అన్ని జంతువుల్లో డెక్కలు పూర్తిగా చీలకుండా ఉండి నెమరు వేయకుండా ఉన్నవి మీకు అపవిత్రం. వాటి కళేబరాలు మీరు ముట్టుకోకూడదు. అలాటి వాటిని తాకిన వాడు అపవిత్రుడు అవుతాడు.
27 నాలుగు కాళ్లపై నడిచే జంతువుల్లో ఏవి తమ పంజాపై నడుస్తాయో అవి మీకు అపవిత్రం. వాటి కళేబరాలు ముట్టుకున్న వాడు సాయంకాలం వరకూ అపవిత్రంగా ఉంటాడు.
28 ఎవరైనా వాటి కళేబరాల్లో దేన్ని అయినా మోస్తే అలాంటి వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. వాడు సాయంకాలం వరకూ అపవిత్రంగా ఉంటాడు. ఈ జంతువులు మీకు అపవిత్రమైనవి.
29 నేలపైన పాకే జంతువుల్లో మీకు అపవిత్రమైనవి ఇవి. ముంగిస, ఎలుక, బల్లి జాతికి చెందిన ప్రతి జీవీ,
30 తొండ, ఉడుము, బల్లి, తొండ, చిట్టి ఉడుము, ఊసరవెల్లి.
31 పాకే జీవులన్నిటిలో ఇవి మీకు అపవిత్రం. ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టుకునేవాడు సాయంకాలం వరకూ అపవిత్రుడుగా ఉంటాడు.
32 ఒకవేళ అవి చనిపోయిన తరువాత వాటి కళేబరాలు దేని పైన పడతాయో అవి చెక్క వస్తువులైనా, వస్త్రంతో చేసినవైనా, చర్మంతో చేసినవైనా, గోనె గుడ్డతో చేసినవైనా అవి అపవిత్రం అవుతాయి. ఆ వస్తువు ఏదైనా, దేనికోసం వాడుతున్నా అపవిత్రం అయినప్పుడు దాన్ని నీళ్ళలో ఉంచాలి. సాయంకాలం వరకూ అది అపవిత్రంగా ఉంటుంది. తరువాత అది పవిత్రం అవుతుంది.
33 వీటిలో ఏ జంతువైనా ఏదైనా మట్టిపాత్ర పైన గానీ, మట్టిపాత్రలో గానీ పడితే, ఆ పాత్రలో ఉన్నది ఏదైనా అపవిత్రం అవుతుంది. అప్పుడు మీరు ఆ మట్టిపాత్రను పగలగొట్టాలి.
34 పవిత్రమూ తినదగినదీ అయిన ఏ ఆహారంలోనైనా ఆ అపవిత్రం అయిన ఆ మట్టిపాత్రలోని నీళ్ళు పడితే ఆ ఆహారం అపవిత్రం అవుతుంది. అలాంటి పాత్ర లోంచి ఏ పానీయం తాగినా అది అపవిత్రం అవుతుంది.
35 వాటి కళేబరాల్లో ఏ కొంచెమన్నా దేనిపైనన్నా పడితే అది అపవిత్రం అవుతుంది. అది పొయ్యి అయినా, వంటపాత్ర అయినా దాన్ని ముక్కలుగా పగలగొట్టాలి. అది అపవిత్రం, అది మీకు అపవిత్రంగానే ఉండాలి.
36 నీళ్ళు చేదుకునే పెద్ద తొట్టిలో గానీ, ఊటలో గానీ అలాంటి కళేబరం పడినా ఆ నీళ్ళు అపవిత్రం కావు. అయితే ఆ నీటిలో పడిన కళేబరాన్ని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు అపవిత్రం అవుతారు.
37 ఆ కళేబరాల్లో ఏదో ఒక భాగం నాటేందుకు సిద్ధంగా ఉన్న విత్తనాలపై పడినా ఆ విత్తనాలు అపవిత్రం కావు.
38 కానీ నానబెట్టిన విత్తనాలపైన అపవిత్రమైన కళేబరం పడితే అవి మీకు అపవిత్రం అవుతాయి.
39 మీరు తిన దగ్గ జంతువుల్లో ఏదన్నా చస్తే దాని కళేబరాన్ని ముట్టుకునే వాడు ఆ సాయంత్రం వరకూ అపవిత్రుడిగా ఉంటాడు.
40 ఆ కళేబరములోనుండి దేనినైనా తినేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. అతడు సాయంత్రం వరకూ అపవిత్రుడిగా ఉంటాడు. దాని కళేబరాన్ని మోసేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి.
41 నేలమీద పాకే జీవులన్నీ అసహ్యం. వాటిని మీరు తినకూడదు.
42 నేలపై పాకే అన్ని జంతువులు, అంటే తమ పొట్టతో పాకే జీవులైనా, నాలుగు కాళ్ళపై నడిచేవైనా, అనేకమైన కాళ్ళు ఉన్నవైనా ఇవన్నీ మీరు తినకూడదు. ఇవి మీకు అసహ్యంగా ఉండాలి.
43 ఇలా పాకే జీవులను తిని మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకూడదు. వాటి ద్వారా మీరు అపవిత్రం కాకూడదు. అశుద్ధం కాకూడదు.
44 ఎందుకంటే నేను యెహోవాని. మీ దేవుణ్ణి. నేను పరిశుద్ధుణ్ణి. కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండేలా శుద్ధీకరణ చేసుకోండి. నేలపైన పాకే జీవుల మూలంగా మిమ్మల్ని మీరు మలినం చేసుకోవద్దు.
45 మీకు దేవుడిగా ఉండటానికి మిమ్మల్ని ఐగుప్తుదేశంలోనుండి బయటకు తీసుకు వచ్చిన యెహోవాను నేను. కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుణ్ణి.”
46 ఇది జంతువులూ, పక్షులూ, నీళ్ళలో నివసించే ప్రాణులూ, నేలపైన పాకే జీవులను గూర్చిన శాసనం.
47 ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది పవిత్రమో, ఏది అపవిత్రమో తెలియజేయడం దీని ఉద్దేశం.