Joshua 9 in Telugu

1 యొర్దాను అవతల ఉన్న కొండ ప్రాంతంలో, లోయ ప్రాంతాల్లో, లెబానోను ముందు ఉన్న మహా సముద్ర తీర ప్రాంతమంతా ఉన్న హిత్తీయులూ అమోరీయులూ కనానీయులూ పెరిజ్జీయులూ హివ్వీయులూ యెబూసీయులూ మొదలైన రాజులంతా జరిగిన దాన్ని విన్నప్పుడు

2 వారు యెహోషువతో, ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చారు.

3 యెహోషువ యెరికోకి, హాయికీ చేసినదాన్ని గిబియోను ప్రజలు విన్నప్పుడు

4 వారు కుయుక్తితో, రాయబారుల్లాగా వేషం వేసికొని బయలుదేరి, తమ గాడిదలకు పాత గోనెసంచులు కట్టి, పాతగిలి మాసికలు వేసిన ద్రాక్షారసం తిత్తులు తీసుకుని,

5 పాతబడి పిగిలిపోయిన చెప్పులు తొడుక్కుని, పాతబట్టలు కట్టుకుని వచ్చారు. వారు ఆహారంగా తెచ్చుకొన్న రొట్టెలన్నీ ఎండిన ముక్కల్లాగా ఉన్నాయి.

6 వారు గిల్గాలులో శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చి “మేము దూర దేశం నుండి వచ్చాం, మాతో ఒక ఒప్పందం చేయండి” అని అతనితోనూ ఇశ్రాయేలీయులతోనూ అన్నారు.

7 అప్పుడు ఇశ్రాయేలీయులు “మీరు మా మధ్య నివసిస్తున్న వారేనేమో, మేము మీతో ఎలా ఒప్పందం చేస్తాం?” అని ఆ హివ్వీయులతో అన్నారు.

8 వారు “మేము నీ దాసులం” అని యెహోషువతో చెప్పారు. యెహోషువ “మీరు ఎవరు? ఎక్కడనుండి వచ్చారు?” అని వారిని అడిగాడు.

9 వారు “నీ దేవుడైన యెహోవా నామాన్నిబట్టి నీ దాసులమైన మేము బహు దూరం నుండి వచ్చాం. దానికి కారణం ఆయన కీర్తినీ, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తాన్నీ,

10 యొర్దాను తీరంలో ఉన్న హెష్బోను రాజైన సీహోను, అష్తారోతులో ఉన్న బాషాను రాజైన ఓగు అనే ఇద్దరు అమోరీయుల రాజులకు ఆయన చేసినదంతా మేము విన్నాం.

11 అప్పుడు మా పెద్దలూ మా దేశ ప్రజలంతా మాతో, మీరు ప్రయాణం కోసం ఆహారం తీసుకుని వారికి ఎదురు వెళ్లి వారితో ‘మేము మీ దాసులం కాబట్టి మాతో ఒక ఒప్పందం చేయండి’ అని మీతో చెప్పమన్నారు.

12 మీ దగ్గరికి రావాలని బయలుదేరిన రోజు మేము సిద్ధం చేసుకుని మా ఇళ్ళనుండి తెచ్చుకొన్న వేడి ఆహార పదార్ధాలు ఇవే, ఇప్పటికి అవి యెండిపోయి ముక్కలయ్యాయి.

13 ఈ ద్రాక్షారసపు తిత్తులు మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పుడు అవి చినిగిపోయాయి. బహుదూర ప్రయాణం చేయడం వల్ల మా బట్టలు, చెప్పులు పాతవైపోయాయి” అని అతనితో చెప్పారు.

14 ఇశ్రాయేలీయులు యెహోవా దగ్గర అనుమతి తీసుకోకుండానే వారి ఆహారంలో కొంత తీసుకున్నారు.

15 యెహోషువ ఆ వచ్చిన వారితో సంధి చేసి వారు చావకుండేలా వారితో ఒప్పందం చేశాడు. సమాజ ప్రధానులు కూడా వారితో ప్రమాణం చేశారు.

16 అయితే వారితో ఒప్పందం చేసి మూడు రోజులైన తరువాత, వారు తమకు పొరుగు వారేననీ, తమ మధ్య నివసించే వారేననీ ఇశ్రాయేలీయులు తెలుసుకున్నారు.

17 ఇశ్రాయేలీయులు ముందుకు సాగి మూడవరోజు వారి పట్టణాలకు వచ్చారు. వారి పట్టణాలు గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యత్యారీము.

18 ఇశ్రాయేలీయులు వారిని చంపలేదు. ఎందుకంటే వారి నాయకులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేశారు. అయితే, సమాజమంతా నాయకులకు వ్యతిరేకంగా సణగడం మొదలుపెట్టారు.

19 దానికి ఆ సమాజ ప్రధానులంతా ప్రజలతో ఇలా అన్నారు. “మనం ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడు అని వారితో ప్రమాణం చేశాం కాబట్టి మనం వారికి హాని చేయకూడదు.

20 మనం వారితో చేసిన ప్రమాణం వల్ల మనమీదికి ఉగ్రత రాకుండ ఆ ప్రమాణం గురించి వారిని బతకనియ్యాలి” అని చెప్పారు.

21 నాయకులు “వారిని బతకనియ్యండి” అని చెప్పినందుకు గిబియోనీయులు ఇశ్రాయేలు సమాజమంతటికీ కట్టెలు కొట్టేవారుగా, నీళ్లు తోడేవారుగా అయ్యారు.

22 యెహోషువ వారిని పిలిపించి ఇలా చెప్పాడు. “మీరు మా మధ్య నివసించేవారే అయినా చాలా దూరం నుండి వచ్చామని మీరెందుకు మమ్మల్ని మోసం చేశారు?

23 ఆ కారణం వల్ల మీరు శాపగ్రస్తులౌతారు, నా దేవుని ఆలయానికి కట్టెలు నరకడానికీ నీళ్లు తోడడానికీ మీలో కొంతమంది ఎప్పటికీ బానిసలుగానే ఉంటారు” అన్నాడు.

24 అందుకు వారు యెహోషువను చూసి “నీ దేవుడు యెహోవా ఈ దేశాన్నంతా మీకిచ్చి, మీ ముందు నిలవకుండా ఈ దేశ ప్రజలందరినీ నాశనం చేయమని తన సేవకుడు మోషేకు ఆజ్ఞాపించాడని నీ దాసులమైన మాకు రూఢిగా తెలిసింది. కాబట్టి మేము మా ప్రాణాల గురించి చాలా భయపడి ఈ విధంగా చేశాం.

25 కాబట్టి మేము నీ వశంలో ఉన్నాం, నీ దృష్టికి ఏది న్యాయమో, ఏది మంచిదో, అదే మాకు చెయ్యి” అని యెహోషువకు జవాబిచ్చారు.

26 కాబట్టి యెహోషువా ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండా వారి చేతుల్లోనుండి విడిపించాడు.

27 అయితే సమాజం కోసమూ యెహోవా నిర్ణయించిన చోట ఉండే బలిపీఠం కోసమూ కట్టెలు నరికే వారుగా నీళ్లు తోడేవారుగా యెహోషువ ఆ రోజే వారిని నియమించాడు. ఇప్పటివరకూ వారు ఆ పని చేస్తూనే ఉన్నారు.