Joshua 16 in Telugu

1 యోసేపు సంతతి వారికి వచ్చిన వంతు యెరికో దగ్గర యొర్దాను నుండి

2 తూర్పున ఉన్న యెరికో నీటి ఊటలు వరకూ, యెరికో నుండి బేతేలు కొండ సీమ వరకూ ఉంది.

3 అది బేతేలు నుండి లూజు వరకూ పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకూ సాగి కింద బేత్‌హోరోను వరకూ గెజెరు వరకూ పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దు వరకూ వ్యాపించింది. దాని సరిహద్దు సముద్రం దగ్గర అంతం అయింది.

4 అక్కడ యోసేపు కుమారులు, మనష్షే ఎఫ్రాయిం సంతతి వారు స్వాస్థ్యాన్ని పొందారు.

5 ఎఫ్రాయిమీయుల సరిహద్దు, అంటే వారి వంశాల ప్రకారం వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి ఎగువ బేత్‌హోరోను వరకూ తూర్పుగా వ్యాపించింది.

6 వారి సరిహద్దు మిక్మెతాతు దగ్గర ఉన్న సముద్రం వరకూ పశ్చిమోత్తరంగా వ్యాపించి ఆ సరిహద్దు తానాత్ షిలోహు వరకూ తూర్పువైపుగా చుట్టూ తిరిగి యానోహా వరకూ తూర్పున దాని దాటి

7 యానోహా నుండి అతారోతు వరకూ, నారా వరకూ యెరికోకు తగిలి యొర్దాను దగ్గర అంతమయింది.

8 తప్పూయ మొదలు ఆ సరిహద్దు కానా వాగు వరకూ పశ్చిమంగా వ్యాపించింది. అది వారి వంశాల ప్రకారం ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యం.

9 ఎఫ్రాయిమీయులకు అక్కడక్కడ ఇవ్వబడిన పట్టణాలు పోతే ఆ పట్టణాలన్నీ వాటి పల్లెలు మనష్షీయుల స్వాస్థ్యంలో ఉన్నాయి.

10 అయితే గెజెరులో నివసించిన కనానీయులను వారు వెళ్ళగొట్ట లేదు. ఇప్పటి వరకూ ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసిస్తూ వారికి దాస్యం చేస్తూ ఉన్నారు.