Jeremiah 34 in Telugu

1 బబులోను రాజైన నెబుకద్నెజరు, అతని సైన్యం అంతా, అతని అధికారం కింద ఉన్న భూరాజ్యాలు, ప్రజలు, అందరూ కలిసి యెరూషలేము మీద, దాని ప్రాంతాలన్నిటి మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా అన్నాడు.

2 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, నువ్వు వెళ్లి యూదా రాజైన సిద్కియాతో ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పేదేమంటే, చూడు, నేను ఈ పట్టణాన్ని బబులోను రాజు చేతికి అప్పగించబోతున్నాను. అతడు దానికి నిప్పుపెట్టి కాల్చేస్తాడు.

3 నువ్వు అతని చేతిలోనుంచి తప్పించుకోలేవు, కచ్చితంగా నువ్వు అతనికి దొరికిపోతావు, నిన్ను అతని చేతికి అప్పగించడం జరుగుతుంది. బబులోను రాజును నువ్వు నీ కళ్ళతో చూస్తావు. నువ్వు బబులోను వెళ్ళినప్పుడు నువ్వు అతనితో ముఖాముఖి మాట్లాడతావు.’

4 యూదా రాజువైన సిద్కియా, యెహోవా మాట విను! నీ విషయంలో యెహోవా ఇలా అంటున్నాడు, ‘నీకు ఖడ్గంతో చావు రాదు. ప్రశాంతంగానే చనిపోతావు.

5 నీకంటే ముందుగా ఉన్న పూర్వపు రాజులైన నీ పితరులను దహనం చేసినట్టు నీ శరీరాన్ని దహనం చేస్తారు.’ అప్పుడు వాళ్ళు ‘అయ్యో, ప్రభూ!’ అంటారు. నీ కోసం ఏడుస్తారు. అలా జరగాలని పలికిన వాణ్ణి నేనే. ఇదే యెహోవా వాక్కు.”

6 కాబట్టి, యెరూషలేములో ఉన్న యూదా రాజైన సిద్కియాకు యిర్మీయా ఈ వాక్కులన్నీ ప్రకటించాడు.

7 బబులోను రాజు సైన్యం యెరూషలేము మీద, మిగతా యూదా పట్టాణాలన్నిటి మీద, ప్రాకారాలు కలిగిన పట్టణాలైన లాకీషు, అజేకా మీద దండెత్తింది.

8 యూదాలో తన తోటి ఇశ్రాయేలీయుణ్ణి ఎవరూ దాస్యానికి పెట్టుకోకూడదనీ, తమ దాస్యంలో ఉన్న ఇశ్రాయేలు స్త్రీలను, పురుషులను ప్రతివాడూ విడుదల చెయ్యాలనీ,

9 రాజైన సిద్కియా యెరూషలేములో ఉన్న ప్రజలందరితో ఒప్పందం చేసిన తరువాత, యెహోవా దగ్గర నుంచి యిర్మీయాకు వచ్చిన వాక్కు.

10 ఆ ఒప్పందాన్నిబట్టి అందరూ తమకు దాసదాసీలుగా ఉన్న వాళ్ళను విడిపిస్తామనీ, ఇకముందు ఎవరూ వాళ్ళచేత దాస్యం చేయించుకోమనీ ఒప్పుకుని, ఆ నిబంధనలో చేరిన నాయకులు, ప్రజలు దానికి విధేయులై, వాళ్ళను విడిపించారు.

11 అయితే ఆ తరువాత వాళ్ళు మనస్సు మార్చుకుని, తాము స్వతంత్రులుగా వెళ్ళనిచ్చిన దాసదాసీలను మళ్ళీ దాసులుగా, దాసీలుగా చేసుకోడానికి బలవంతంగా వాళ్ళను పట్టుకున్నారు.

12 కాబట్టి, యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా చెప్పాడు,

13 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, దాస్య గృహమైన ఐగుప్తుదేశం నుంచి నేను మీ పితరులను తీసుకొచ్చిన రోజు వాళ్ళతో ఈ ఒప్పందం చేశాను.

14 నీకు అమ్మకం జరిగాక, నీకు ఆరు సంవత్సరాలు దాస్యం చేసిన హెబ్రీయులైన మీ సహోదరులకు, ఏడు సంవత్సరాలు తీరిన తరువాత, విడుదల ప్రకటించాలి. కాని మీ పితరులు శ్రద్ధ వహించలేదు, నా మాట వినలేదు.”

15 “మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకుని, ఒక్కొక్కడు తన పొరుగువాడికి విడుదల ప్రకటిస్తామని చెప్పి, నా పేరు పెట్టిన ఈ మందిరంలో నా సన్నిధిలో ఒప్పందం చేశారు. నా దృష్టిలో ఏది మంచిదో అది చెయ్యడం మొదలుపెట్టారు.

16 కాని, తరువాత మీరు మనస్సు మార్చుకుని నా పేరును అపవిత్రం చేశారు. వాళ్ళకు ఎటు ఇష్టమైతే అటు వెళ్ళగలిగేలా వాళ్ళను స్వతంత్రులుగా వెళ్ళనిచ్చిన తరువాత, అందరూ తమ దాసదాసీలను మళ్ళీ తెచ్చుకుని, తమకు దాసులుగా, దాసీలుగా ఉండడానికి వాళ్ళను బలవంతంగా మళ్ళీ పట్టుకున్నారు.”

17 కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు. “ఒక్కొక్కడు తన సహోదరులకూ, తన పొరుగువారికీ విడుదల ప్రకటించాలని నేను చెప్పిన మాట మీరు వినలేదు. కాబట్టి చూడండి, నేను మీకు విడుదల ప్రకటించబోతున్నాను. అది ఖడ్గంతో, తెగులుతో, కరువుతో మీరు నాశనం అవ్వడానికే నేను ప్రకటించే విడుదల. భూమి మీద ఉన్న ప్రతి రాజ్యాన్ని బట్టి మీరు గడగడా వణికేలా చేస్తాను.

18 నా సన్నిధిలో తాము చేసిన ఒప్పందపు మాటలు నెరవేర్చకుండా దాన్ని అతిక్రమించిన వాళ్ళ విషయం పట్టించుకుంటాను. వాళ్ళు ఒక దున్నపోతును రెండు భాగాలుగా కోసి వాటి మధ్య నడిచేవాళ్ళు.

19 తరువాత యూదా నాయకులు, యెరూషలేము నాయకులు, నపుంసకులు, యాజకులు, దేశంలో ఉన్న ప్రజలందరూ ఆ దున్నపోతు రెండు భాగాల మధ్య నడిచేవాళ్ళు. ఆ దున్నపోతుకు చేసినట్టు నేను వాళ్ళకు చేస్తాను.

20 వాళ్ళ ప్రాణం తియ్యాలని చూసే శత్రువుల చేతికి వాళ్ళను అప్పగిస్తాను. వాళ్ళ శవాలు ఆకాశపక్షులకు, భూమృగాలకు ఆహారంగా ఉంటాయి.

21 యూదా రాజైన సిద్కియాను, అతని నాయకులను, వాళ్ళ ప్రాణం తియ్యాలని చూసే వాళ్ళ శత్రువుల చేతికి, మీ మీదకు లేచిన బబులోను రాజు సైన్యం చేతికి అప్పగిస్తాను.”

22 యెహోవా వాక్కు ఇదే. “నేను ఒక ఆజ్ఞ ఇవ్వబోతున్నాను. వాళ్ళను ఈ పట్టణానికి మళ్ళీ తీసుకొస్తాను. వాళ్ళు దాని మీద యుద్ధం చేసి దాన్ని స్వాధీనం చేసుకుని, తగలబెడతారు. యూదా పట్టణాలను శిథిలాలుగా, నిర్జనంగా మారుస్తాను.”