Isaiah 37 in Telugu

1 ఆ మాటలు విని హిజ్కియా తన బట్టలు చింపుకుని, గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరానికి వెళ్ళాడు.

2 రాజ గృహ నిర్వాహకుడు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకుల్లో పెద్దలను ఆమోజు కొడుకు, ప్రవక్త అయిన యెషయా దగ్గరికి పంపించాడు.

3 వారంతా గోనెపట్ట కట్టుకుని అతని దగ్గరికి వచ్చి అతనితో “హిజ్కియా ఇలా చెప్పమన్నాడు, ‘ఈ రోజు బాధ, శిక్ష, నిందల రోజు. పిల్లలు పుట్టడానికి సమయం వచ్చిందిగాని కనడానికి తల్లికి శక్తి లేదు.

4 సజీవుడైన దేవుణ్ణి దూషించడానికి తన యజమాని అష్షూరు రాజు పంపిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడు యెహోవా ఒకవేళ విని, ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దిస్తాడేమో. కాబట్టి ఇప్పటికి బతికి ఉన్న మన కొద్దిమంది కోసం నువ్వు ఎక్కువగా ప్రార్థన చెయ్యి.’”

5 హిజ్కియా రాజు సేవకులు యెషయా దగ్గరికి వచ్చారు.

6 యెషయా వారితో ఇలా అన్నాడు. “మీ యజమానికి ఈ మాట చెప్పండి, యెహోవా ఏమి చెబుతున్నాడంటే, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషిస్తూ పలికిన మాటలకు భయపడవద్దు.

7 అతనిలో నేను ఒక ఆత్మను పుట్టిస్తాను. అతడు ఒక పుకారు విని తన దేశానికి తిరిగి వెళ్ళిపోతాడు. అతని దేశంలోనే కత్తివాత హతం అవుతాడు.”

8 అష్షూరు రాజు లాకీషు పట్టణం విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధం చేస్తున్నాడని తెలిసి రబ్షాకే తిరిగి వెళ్ళి అతనితో కలిశాడు.

9 కూషు రాజు తిర్హాకా తనపై యుద్ధం చేయడానికి వచ్చాడని అష్షూరురాజు సన్హెరీబు విన్నాడు. అప్పుడు అతడు తన దూతలతో హిజ్కియాకు ఒక సందేశం పంపాడు.

10 “యూదా రాజు హిజ్కియాతో ఇలా చెప్పండి, ‘నీ దేవుని చేతిలో మోసపోయి అష్షూరు రాజు యెరూషలేమును ఆక్రమించలేడని అనుకోవద్దు.

11 అష్షూరు రాజులు సకల దేశాలనూ పూర్తిగా నాశనం చేసిన సంగతి నువ్వు విన్నావు కదా, నీవు మాత్రం తప్పించుకోగలవా?

12 నా పూర్వికులు నిర్మూలం చేసిన గోజాను, హారాను, రెజెపు, తెలశ్శారులో ఉండే ఏదెనీయులు, వీరిలో ఎవరైనా తమ దేవుళ్ళ సహాయంతో తప్పించుకున్నారా?

13 హమాతు, అర్పదు, సెపర్వయీము, హేన, ఇవ్వా అనే పట్టణాల రాజులు ఏమయ్యారు?’”

14 హిజ్కియా ఆ ఉత్తరం తీసుకుని, చదివి, యెహోవా మందిరంలోకి వెళ్లి ఆయన సన్నిధిలో దాన్ని ఉంచాడు.

15 తరువాత ఈ విధంగా ప్రార్థన చేశాడు,

16 “యెహోవా, కెరూబుల మధ్య నివసించే ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశాలను సృష్టించిన అద్వితీయ దేవా, నీవు ఈ లోక రాజ్యాలన్నిటిపై దేవుడివి.

17 సేనల ప్రభువైన యెహోవా, నీ కళ్ళు తెరచి చూసి నా మాటలు ఆలకించు. జీవం గల దేవుడవైన నిన్ను దూషిస్తూ సన్హెరీబు రాసిన మాటలు విను.

18 యెహోవా, అష్షూరు రాజులు వివిధ జాతుల ప్రజలనూ వారి దేశాలనూ నాశనం చేసి వారి దేవుళ్ళను అగ్నిలో వేసింది నిజమే.

19 ఆ రాజ్యాల దేవుళ్ళు నిజమైనవారు కారు. చెక్కతో రాళ్ళతో మనుషులు చేసిన వారు కనుక అష్షూరు రాజులు వారిని నిర్మూలం చేశారు.

20 యెహోవా, ఈ లోకంలో నీవే, నిజంగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా అని మనుషులంతా గ్రహించేలా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించు.”

21 అప్పుడు ఆమోజు కొడుకు యెషయా హిజ్కియా దగ్గరికి ఈ సందేశం పంపాడు. “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే, అష్షూరు రాజు సన్హెరీబు విషయం నీవు నా ఎదుట ప్రార్థన చేశావు కదా,

22 అతని గూర్చి యెహోవా సెలవిచ్చే మాట ఇదే, “కన్య అయిన సీయోను ఆడపడుచు నిన్ను తిరస్కరించి, అపహసిస్తున్నది, యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుతూ ఉంది.

23 నువ్వు ఎవరిని తిరస్కరించావు? ఎవరిని దూషించావు? గర్వంతో ఎవరిని భయపెట్టాలని చూశావు? పరిశుద్ధుడైన ఇశ్రాయేలీయుల దేవుణ్ణి కదా?

24 నీ దూతల ద్వారా యెహోవాను తిరస్కరించి నువ్వు ఇలా పలికావు, ‘నా గొప్ప రథాల గుంపుతో నేను పర్వత శిఖరాల మీదకీ ఉన్నతమైన లెబానోను స్థలాల పైకీ ఎక్కాను. ఎత్తయిన దాని దేవదారు చెట్లూ శ్రేష్ఠమైన సరళ చెట్లూ నరికేశాను. వాటికి బహు దూరంలో సరిహద్దుల్లో ఉన్న సత్రాల్లోకి, ఫలవంతమైన అడవిలోకి ప్రవేశించాను.

25 నేను బావులు తవ్వి అక్కడి నీళ్లు తాగాను. నా అరకాలి కింద ఐగుప్తు నదులన్నిటిని ఎండిపోయేలా చేశాను.’

26 అయితే దీన్ని నేనే ఎప్పుడో నిర్ణయించాననీ, పూర్వకాలంలోనే దీన్ని ఏర్పాటు చేశాననీ నీకు వినబడలేదా? నువ్వు ప్రాకారాలు గల పట్టణాలను పాడుదిబ్బలుగా చేయడం నా వల్లనే జరిగింది.

27 అందుకే వాటి ప్రజలు బలహీనులై చెదరిపోయారు. భయంతో పొలంలోని గడ్డిలాగా, బలం లేని కాడల్లాగా మారారు.

28 నువ్వు కూర్చోవడం, బయటికి వెళ్ళడం, లోపలి రావడం, నా మీద రంకెలు వేయడం నాకు తెలుసు.

29 నా మీద నువ్వు వేసే రంకెలు, నీవు చూపిన అహంకారం నా దాకా వచ్చాయి. కాబట్టి నీ ముక్కుకి నా గాలం తగిలిస్తాను. నా కళ్ళెం నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లిస్తాను. నీవు వచ్చిన దారిలోనే నిన్ను తిప్పి పంపుతాను.”

30 యెషయా ఇంకా ఇలా చెప్పాడు. “హిజ్కియా, నీకిదే సూచన. ఈ సంవత్సరం దానంతట అదే పండే ధాన్యాన్నీ, రెండో సంవత్సరంలో దాని నుండి కలిగే ధాన్యాన్నీ మీరు తింటారు. మూడో సంవత్సరంలో మీరు విత్తనం చల్లి పంట కోస్తారు. ద్రాక్షతోటలు నాటి వాటిఫలం అనుభవిస్తారు.

31 యూదా వంశంలో తప్పించుకొన్న శేషం బాగా వేరుతన్ని ఎదిగి ఫలిస్తారు.

32 మిగిలినవారు యెరూషలేములో నుండి, తప్పించుకొన్న వారు సీయోను కొండలో నుండి బయలుదేరతారు. సైన్యాల అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేరుస్తుంది.

33 కాబట్టి అష్షూరు రాజు గూర్చి యెహోవా చెప్పేది ఏమంటే, ‘అతడు ఈ పట్టణంలోకి రాడు. దాని మీద ఒక బాణం కూడా విసరడు. ఒక్క డాలైనా ఆడించడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు.

34 ఈ పట్టణం లోపలికి రాకుండా తాను వచ్చిన దారిలోనే అతడు తిరిగి పోతాడు.’ ఇదే యెహోవా వాక్కు.

35 నా నిమిత్తమూ నా సేవకుడైన దావీదు నిమిత్తమూ నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను.”

36 అప్పుడు యెహోవా దూత వెళ్ళి అష్షూరువారి సైనిక పటాలంలో 1,85,000 మందిని హతమార్చాడు. ఉదయాన్నే ప్రజలు చూసినప్పుడు వారంతా శవాలుగా పడి ఉన్నారు.

37 అష్షూరు రాజు సన్హెరీబు తిరిగి నీనెవె పట్టణానికి వెళ్ళిపోయాడు.

38 ఆ తరవాత అతడు నిస్రోకు అనే తన దేవత మందిరంలో పూజలు చేస్తూ ఉన్నప్పుడు అద్రమ్మెలెకు, షెరెజెరు అనే అతని కొడుకులు అతణ్ణి కత్తితో చంపి ఆరారాతు దేశంలోకి పారిపోయారు. అప్పుడు అతని కొడుకు ఎసర్హద్దోను అతనికి బదులుగా రాజయ్యాడు.