Hosea 14 in Telugu

1 ఇశ్రాయేలూ, నీ పాపం చేత నీవు కూలిపోయావు గనక నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు.

2 ఒప్పుకోలు మాటలు సిద్ధపరచుకుని యెహోవా దగ్గరికి తిరిగి రండి. మీరు చెప్పవలసినదేమిటంటే “మా పాపాలన్నిటిని పరిహరించు. మమ్మల్ని అనుగ్రహంతో స్వీకరించు. అప్పుడు మేము మా పెదాల ఫలాలను అంటే స్తుతులను అర్పిస్తాము.

3 అష్షూరీయులు మమ్మల్ని రక్షించరు. మేమిక మీదట గుర్రాలెక్కి యుద్ధానికి పోము. ‘మీరే మాకు దేవుడు’ అని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రిలేని వారికి వాత్సల్యం నీ దగ్గరే దొరుకుతుంది.”

4 వారు నన్ను వదిలి వెళ్ళిపోయిన తరువాత నేను వారిని బాగు చేస్తాను. వారి మీదనున్న నా కోపం చల్లారింది. మనస్ఫూర్తిగా వారిని ప్రేమిస్తాను.

5 చెట్టుకు మంచు ఉన్నట్టు నేనతనికి ఉంటాను. తామర పువ్వు పెరిగేలా అతడు అభివృద్ధి పొందుతాడు. లెబానోను పర్వతాల్లో దేవదారు వృక్షంలాగా వారు వేరు పారుతారు.

6 అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి. ఒలీవచెట్టు కు ఉండే శోభ అతనికి కలుగుతుంది. లెబానోను దేవదారు చెట్లకు ఉన్నంత సువాసన అతనికి ఉంటుంది.

7 అతని నీడలో నివసించేవారు మరలివస్తారు. ధాన్యం వలే వారు తిరిగి మొలుస్తారు. ద్రాక్షచెట్టులాగా వికసిస్తారు. లెబానోను ద్రాక్షరసానికి ఉన్న కీర్తి వారికి ఉంటుంది.

8 ఎఫ్రాయిము ఇలా అంటాడు “బొమ్మలతో నాకిక పనేమిటి?” నేనే అతనికి జవాబిచ్చి ఆలకిస్తున్నాను. నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేస్తున్నాను. నేను సతత హరిత సరళ వృక్షం వంటి వాణ్ణి. నావల్లనే నీకు ఫలం కలుగుతుంది.

9 ఈ సంగతులు వివేచించే జ్ఞానులెవరు? వాటిని గ్రహించి తెలుసుకునే బుద్ధిమంతులెవరు? ఎందుకంటే యెహోవా మార్గాలు యథార్థమైనవి. నీతిమంతులు వాటిలో నడుచుకుంటారు. అయితే తిరుగుబాటు చేసేవారు తడబడి కూలుతారు.