Hebrews 4 in Telugu

1 అందుచేత, ‘దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాం’ అన్న వాగ్దానం ఇంకా కొనసాగుతూ ఉన్నప్పుడే, మీలో ఎవరికైనా ఆ వాగ్దానం దక్కకుండా పోతుందేమో అని జాగ్రత్త పడండి.

2 విశ్రాంతిని గూర్చిన సువార్త ఇశ్రాయేలీయులకు ప్రకటించినట్టే మనకూ ప్రకటించడం జరిగింది. కానీ విన్న దానికి తమ విశ్వాసం జోడించని వారికి ఆ ప్రకటన వ్యర్ధమై పోయింది.

3 అయితే విశ్వసించిన మనమే ఆ విశ్రాంతిలో ప్రవేశించేది. రాసి ఉన్న దాని ప్రకారం లోకం ఆరంభం నుండి తన సృష్టి కార్యమంతా ముగిసినా ఆయన, “నేను నా తీవ్ర ఆగ్రహంతో శపథం చేశాను. వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు” అన్నాడు.

4 మరో చోట ఏడవ దినం గూర్చి చెబుతూ, “దేవుడు ఏడవ రోజు తన పనులన్నీ ముగించి, విశ్రాంతి తీసుకున్నాడు” అన్నాడు.

5 మళ్లీ “వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు” అని చెప్పాడు.

6 దేవుని విశ్రాంతి కొందరు ప్రవేశించడానికి ఏర్పడిందన్నది స్పష్టం. కాబట్టి, ఎవరికైతే సువార్త ముందుగా ప్రకటించబడిందో వారు తమ అవిధేయత కారణంగా దానిలో ప్రవేశించలేక పోయారు.

7 కాబట్టి దేవుడు, “ఈ దినం” అనే ఒక ప్రత్యేక దినాన్ని నిర్ణయించాడు. మొదట దీన్ని గూర్చిన ప్రస్తావన జరిగిన చాలా కాలానికి, తిరిగి దావీదు ద్వారా ఆయన మాట్లాడినప్పుడు, ఆయన ఇలా అన్నాడు, “మీరు మీ హృదయాలను కఠినపరచుకోకుండా నేడు ఆయన స్వరం వింటే మేలు.”

8 ఒక వేళ యెహోషువ వారికి విశ్రాంతి ఇవ్వగలిగితే దేవుడు మరొక రోజు గూర్చి చెప్పేవాడు కాదు.

9 కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది.

10 ఎందుకంటే దేవుడు తన పనులన్నీ చేసి ముగించి విశ్రాంతి తీసుకున్నట్లే ఆయన విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన పనులన్నీ ముగించి విశ్రాంతిలో ప్రవేశిస్తాడు.

11 కాబట్టి, వారిలా అవిధేయతలో పడిపోకుండా, ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆత్రుత పడదాం.

12 ఎందుకంటే దేవుని వాక్కు సజీవమైనది, క్రియాశీలకమైనది, రెండంచులు ఉన్న ఎలాంటి కత్తి కంటే కూడా పదునుగా ఉండి ప్రాణం నుండి ఆత్మనూ, కీళ్ళ నుండి మూలుగనూ విభజించగలిగేంత శక్తి గలదిగా ఉంటుంది. అది హృదయంలోని ఆలోచనలపైనా ఉద్దేశాలపైనా తీర్పు చెప్పగలదు.

13 సృష్టిలో ఆయనకు కనిపించనిది అంటూ ఏదీ లేదు. మనం లెక్క అప్పగించవలసిన దేవుని దృష్టికి అంతా స్పష్టంగా ఉంది.

14 ఆకాశాలగుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం విశ్వసించినదాన్ని గట్టిగా పట్టుకుందాం.

15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు.

16 కాబట్టి మన అవసరాల్లో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం.