Genesis 28 in Telugu

1 ఇస్సాకు యాకోబును పిలిపించి “నువ్వు కనాను అమ్మాయిల్లో ఎవరినీ పెళ్ళి చేసుకోకూడదు.

2 నువ్వు పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ మేనమామ లాబాను కుమార్తెల్లో ఒకామెను వివాహం చేసుకో

3 సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి, నువ్వు అనేక జాతులయ్యేలా నీకు సంతానాభివృద్ధి కలిగించి, నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవాసిగా ఉన్న దేశాన్ని, అంటే దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశాన్ని నువ్వు వారసత్వంగా పొందేలా

4 ఆయన నీకూ నీ సంతానానికీ అబ్రాహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని దయచేస్తాడు గాక” అని దీవించి పంపివేశాడు.

5 అతడు పద్దనరాములో ఉన్న లాబాను దగ్గరకి ప్రయాణమయ్యాడు. లాబాను సిరియావాడు బెతూయేలు కుమారుడూ యాకోబు, ఏశావుల తల్లి అయిన రిబ్కా సోదరుడూ.

6 ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెళ్ళి చేసుకుని రావడానికి అతణ్ణి అక్కడికి పంపాడనీ అతనిని దీవించినప్పుడు “నువ్వు కనాను దేశపు అమ్మాయిల్లో ఎవరినీ పెళ్ళి చేసుకోవద్దు” అని అతనికి ఆజ్ఞాపించాడనీ ఏశావుకు తెలిసింది.

7 యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయాడనీ,

8 ఇదిగాక కనాను స్త్రీలు తన తండ్రి ఇస్సాకుకు ఇష్టం లేదనీ ఏశావు తెలుసుకున్నాడు.

9 అతడు ఇష్మాయేలు దగ్గరికి వెళ్ళి, తనకున్న భార్యలు గాక అబ్రాహాము కుమారుడు ఇష్మాయేలు కూతురు, నెబాయోతు సోదరి అయిన మహలతును కూడా పెళ్ళి చేసుకున్నాడు.

10 యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తూ

11 ఒకచోట పొద్దుగుంకడంతో అక్కడ ఆ రాత్రి ఆగిపోయి, అక్కడి రాళ్ళలో ఒక దాన్ని తనకు తలగడగా చేసుకుని, పడుకున్నాడు.

12 అప్పుడతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిపి ఉంది. దాని కొన ఆకాశాన్ని అంటింది. దానిమీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు.

13 యెహోవా దానికి పైగా నిలబడి “నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అయిన యెహోవాని. నువ్వు పండుకున్న ఈ భూమిని నీకూ నీ సంతానానికీ ఇస్తాను.

14 నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల్లాగా అసంఖ్యాకంగా పెరిగిపోతుంది. నువ్వు పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణం దిక్కులకు వ్యాపిస్తావు. భూమి మీద వంశాలన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వాదం పొందుతాయి.

15 ఇదిగో నేను నీకు తోడై ఉండి, నువ్వు వెళ్ళే ప్రతి చోటా నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్ళీ రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకూ నిన్ను విడిచిపెట్టను” అని చెప్పాడు.

16 యాకోబు నిద్ర మేలుకుని “నిశ్చయంగా యెహోవా ఈ స్థలం లో ఉన్నాడు. అది నాకు తెలియలేదు” అనుకున్నాడు.

17 అతడు భయపడి “ఈ స్థలం ఎంతో భయం గొలిపేది. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు.

18 పరలోకద్వారం ఇదే” అనుకున్నాడు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభంగా నిలబెట్టి, దాని కొనమీద నూనె పోశాడు.

19 అతడు ఆ స్థలానికి బేతేలు అనే పేరు పెట్టాడు. మొదట ఆ ఊరి పేరు లూజు.

20 అప్పుడు యాకోబు “నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చేలా దేవుడు నాకు తోడై ఉండి, నేను వెళ్తున్న ఈ మార్గంలో నన్ను కాపాడి,

21 తినడానికి ఆహారమూ ధరించడానికి వస్త్రాలూ నాకు దయచేసినట్లైతే యెహోవా నాకు దేవుడై ఉంటాడు.

22 అంతేకాదు, స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. నువ్వు నాకిచ్చే సమస్తంలో పదవ వంతు నీకు తప్పక చెల్లిస్తాను” అని మొక్కుకున్నాడు.