Exodus 10 in Telugu

1 యెహోవా మోషేతో “ఫరో దగ్గరికి తిరిగి వెళ్ళు. నేను చేసిన అద్భుత కార్యాలను వాళ్ళ మధ్య కనపరచాలని నేను అతడి గుండె, అతని సేవకుల గుండెలు బండబారిపోయేలా చేశాను.

2 నేను ఐగుప్తీయుల పట్ల వ్యవహరించిన విధానాన్ని, యెహోవాను నేనేనని మీరు తెలుసుకొనేలా నేను చేస్తున్న అద్భుత కార్యాలను నువ్వు నీ కొడుకులకూ, మనవలకూ తెలియజేయాలి” అని చెప్పాడు.

3 మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పారు. “హెబ్రీయుల దేవుడు యెహోవా చెబుతున్నది ఏమిటంటే, ఎంతకాలం వరకూ నా మాట వినకుండా ఉంటావు? నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.

4 నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో రేపు నేను నీ దేశం మీదికి మిడతలను రప్పిస్తాను.

5 నేల కనపడనంతగా అవి భూమిని కప్పివేస్తాయి. మీ దేశంలో మిగిలిన దాన్ని అంటే వడగండ్ల దెబ్బ నుండి తప్పించుకున్నదాన్ని, అంటే పొలాల్లో మొలకెత్తిన ప్రతి మొక్కనూ అవి తినేస్తాయి.

6 మీ గృహాలూ మీ సేవకుల గృహాలూ ఐగుప్తీయుల ఇళ్ళన్నీ వాటితో నిండిపోతాయి. మీ తండ్రులు, పూర్వికులు ఈ దేశంలో ఉన్నప్పటి నుండి ఈనాటి వరకూ ఇలాంటి వాటిని చూసి ఉండలేదు” అని చెప్పి ఫరో దగ్గర నుండి వెళ్ళిపోయారు.

7 అప్పుడు ఫరో సేవకులు ఫరోతో “ఎంతకాలం వరకూ ఈ మనిషి మనలను ఇబ్బందులకు గురిచేస్తాడు? వాళ్ళ దేవుడు యెహోవాను ఆరాధించడానికి ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వు. మన ఐగుప్తు దేశం పాడైపోతున్నదని నీకింకా తెలియడం లేదా?” అన్నారు.

8 కాబట్టి మోషే అహరోనులను ఫరో దగ్గరికి తీసుకు వచ్చారు. ఫరో “మీరు వెళ్లి మీ దేవుడు యెహోవాను ఆరాధించుకోండి. ఈ పని కోసం ఎవరెవరు వెళ్తారు?” అని అడిగాడు.

9 అందుకు మోషే “మేము యెహోవాకు మహోత్సవం జరిపించాలి. కాబట్టి మా కొడుకులను, కూతుళ్ళను, మందలను, పశువులను వెంటబెట్టుకుని మా పిల్లలతో, పెద్దలతో కలసి వెళ్తాం” అని బదులిచ్చాడు.

10 అందుకు ఫరో “యెహోవా మీకు కావలిగా ఉంటాడా? నేను మిమ్మల్ని మీ పిల్లలతో సహా వెళ్ళనిస్తానా? చూడండి, మీలో దురుద్దేశం ఉంది.

11 కాబట్టి పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాకు ఉత్సవం జరుపుకోండి. మీరు కోరుకున్నది అదే గదా” అన్నాడు. తరువాత వాళ్ళను ఫరో ఎదుట నుండి వెళ్ళగొట్టారు.

12 అప్పుడు యెహోవా మోషేతో “మిడతల దండు వచ్చేలా ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపు. అవి ఐగుప్తు మీదకి వచ్చి ఈ దేశంలో ఉన్న పంటలన్నిటినీ అంటే వడగళ్ళ ద్వారా పాడవని పంటలన్నిటినీ తినివేస్తాయి” అని చెప్పాడు.

13 మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపాడు. యెహోవా ఆ పగలూ, రాత్రీ ఆ దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశాడు. తెల్లవారేసరికి తూర్పు గాలికి ఎగిరే మిడతలు దండుగా వచ్చిపడ్డాయి.

14 తీవ్రంగా హాని కలిగించే ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికీ వచ్చి ఐగుప్తు దేశంలోని అన్ని సరిహద్దుల్లో నిలిచి భూమి మొత్తాన్నీ కప్పివేశాయి. అంతకు ముందెప్పుడూ ఇలాంటి మిడతలు లేవు, ఇకముందు కూడా ఉండబోవు.

15 ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఆ దేశంలో కూరగాయలన్నిటినీ వడగళ్ళు పాడు చేయని పంటలన్నిటినీ చెట్లనూ ఫలాలనూ అవి తినివేశాయి. ఐగుప్తు దేశమంతా చెట్లు గానీ పొలాల పంటలు గానీ పచ్చగా ఉండేది ఏదీ మిగలలేదు.

16 కాబట్టి ఫరో మోషే అహరోనులను వెంటనే పిలిపించాడు. “నేను మీ పట్లా మీ దేవుడు యెహోవా పట్లా తప్పిదం చేశాను.

17 దయచేసి ఈ ఒక్కసారి మాత్రం నా తప్పు క్షమించండి. ఈ చావును తెచ్చే విపత్తును మాత్రం నా మీద నుండి తప్పించమని మీ దేవుడైన యెహోవాను వేడుకోండి” అన్నాడు.

18 మోషే ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్ళి యెహోవాకు ప్రార్ధించాడు.

19 అప్పుడు యెహోవా, గాలిని తిప్పి శక్తివంతమైన పడమటి గాలి విసిరేలా చేశాడు. ఆ గాలి తీవ్రతకు మిడతలు కొట్టుకుపోయి ఎర్ర సముద్రంలో పడిపోయాయి. ఐగుప్తు దేశమంతటిలో ఒక్క మిడత కూడా మిగలలేదు.

20 అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు.

21 అప్పుడు యెహోవా మోషేతో “ఆకాశం వైపు నీ చెయ్యి చాపు. ఐగుప్తు దేశమంతా కటిక చీకటి కమ్ముకుంటుంది” అని చెప్పాడు.

22 మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా మూడు రోజులపాటు గాఢాంధకారం కమ్ముకుంది.

23 ఆ మూడు రోజులు ఒకరికి ఒకరు కనబడలేదు. తామున్న చోటు నుండి ఎవ్వరూ లేచి కదలలేకపోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలందరి ఇళ్ళలో వెలుగు ఉంది.

24 ఫరో మోషేను పిలిపించాడు. “మీరు వెళ్లి యెహోవాను ఆరాధించండి. అయితే మీ మందలూ, పశువులూ మాత్రం ఇక్కడే ఉండాలి. మీ బిడ్డలు మాత్రం మీతో వెళ్ళవచ్చు” అన్నాడు.

25 అందుకు మోషే “మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన హోమ బలి అర్పణల కోసం నువ్వు మా పశువుల మందలను ఇవ్వ వలసి ఉంటుంది.

26 మా పశువులు, మందలు మాతో కూడా రావాలి. మా పశువుల కాలి గిట్ట కూడా విడిచిపెట్టం. మేము వేటిని యెహోవాకు బలి అర్పించాలో అక్కడికి చేరే వరకూ మాకు తెలియదు. మా దేవుడైన యెహోవాను ఆరాధించే సమయంలో మా మందల్లోనుంచే వాటిని తీసుకోవాలి” అని చెప్పాడు.

27 అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు వారిని వెళ్ళనియ్యలేదు.

28 అప్పుడు ఫరో “బయటకు వెళ్ళు, జాగ్రత్త సుమా. ఇకపై నాకు కనిపించకు. నువ్వు నాకు ఎదురు పడిన రోజున తప్పకుండా చస్తావు” అన్నాడు.

29 అందుకు మోషే “సరే నువ్వే అన్నావు గదా, ఇకపై నీ ముఖం చూడను” అన్నాడు.