2 Chronicles 26 in Telugu

1 అప్పుడు యూదా ప్రజలంతా 16 ఏళ్ల వాడైన ఉజ్జియాను అతని తండ్రి అమజ్యాకు బదులు రాజుగా నియమించారు.

2 ఎలోతు పట్టణాన్ని కట్టించి, అది యూదా వారికి తిరిగి వచ్చేలా చేసింది ఇతడే. ఆ తరువాత రాజు తన పూర్వీకులతో పాటు కన్ను మూశాడు.

3 ఉజ్జియా పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు 16 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో 52 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి యెరూషలేము నివాసి. ఆమె పేరు యెకొల్యా.

4 అతడు తన తండ్రియైన అమజ్యా చేసిన దాని ప్రకారం యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించాడు.

5 దేవుని మాట వినేలా సలహాలిచ్చిన జెకర్యా రోజుల్లో అతడు దేవుని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతణ్ణి వర్ధిల్లజేశాడు.

6 అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేశాడు. గాతు, యబ్నె, అష్డోదు పట్టణ ప్రాకారాలను పడగొట్టి, అష్డోదు దేశంలో ఫిలిష్తీయుల ప్రాంతంలో పట్టణాలను కట్టించాడు.

7 ఫిలిష్తీయులతో, గూర్బయలులో నివసించిన అరబీయులతో, మెయోనీయులతో అతడు యుద్ధం చేసినప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడు.

8 అమ్మోనీయులు ఉజ్జియాకు పన్ను చెల్లించారు. అతడు చాలా శక్తిమంతుడయ్యాడు కాబట్టి అతని కీర్తి ఇతర దేశాలకూ ఐగుప్తు వరకూ వ్యాపించింది.

9 ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మం దగ్గర, లోయ గుమ్మం దగ్గర, ప్రాకారపు మూల దగ్గర, బురుజులు కట్టించి వాటి చుట్టూ ప్రాకారాలు ఏర్పరచాడు.

10 అతడు అరణ్యంలో కావలి గోపురాలు కట్టించి చాలా బావులు తవ్వించాడు. అతనికి పల్లపు భూముల్లో, మైదాన భూముల్లో చాలా పశు సంపద ఉంది. కాబట్టి కొండ సీమలో ప్రాంతంలో అతనికి సారవంతమైన భూమీ రైతులూ ద్రాక్షతోట పనివారూ ఉన్నారు. ఎందుకంటే అతనికి వ్యవసాయమంటే ఎంతో ఇష్టం.

11 దీనికి తోడు, ఉజ్జియాకు పోరాడే యోధులున్నారు. వారు లెక్క ప్రకారం గుంపులుగా ఏర్పడి యుద్ధానికి వెళ్ళేవారు. రాజు అధికారుల్లో కార్యదర్శి మయశేయా, ప్రధానమంత్రి యెహీయేలు వారి లెక్క ఎంతైనది చూసి పటాలాలుగా ఏర్పరచేవారు. వీరు హనన్యా చేతి కింద ఉన్నారు.

12 వారి పూర్వీకుల ఇంటి పెద్దల సంఖ్యను బట్టి పోరాడ గలిగిన వారు 2,600 మంది.

13 రాజుకు సహాయం చేయడానికి శత్రువులతో యుద్ధం చేయడంలో పేరు పొందిన పరాక్రమశాలురైన 3,07,500 మంది సైన్యం, వారి చేతి కింద ఉంది.

14 ఉజ్జియా ఈ సైన్యమంతటికీ డాళ్లనూ, ఈటెలనూ, శిరస్త్రాణాలనూ, కవచాలనూ, విల్లులనూ, వడిసెలలనూ చేయించాడు.

15 అతడు అంబులనూ పెద్దరాళ్లనూ ప్రయోగించడానికి నిపుణులు కల్పించిన యంత్రాలను యెరూషలేములో చేయించి కోటల్లో ప్రాకారాల్లో ఉంచాడు. అతడు స్థిరపడే వరకూ అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది కాబట్టి అతని కీర్తి సుదూర ప్రాంతాలకు వ్యాపించింది.

16 అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సులో గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేయడానికి యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేశాడు.

17 యాజకుడైన అజర్యా, అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతనివెంట లోపలికి వెళ్ళారు.

18 వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి “ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయడం నీ పని కాదు. ధూపం వేయడానికి ప్రతిష్ఠించిన అహరోను సంతతివారైన యాజకుల పని అది. పరిశుద్ధస్థలం లోనుంచి బయటికి వెళ్ళు. నీవు ద్రోహం చేశావు. దేవుడైన యెహోవా సన్నిధిలో ఇది నీకు ఘనత కలగజేయదు” అని చెప్పారు.

19 ఉజ్జియా రౌద్రుడయ్యాడు. అతడు ధూపం వేయడానికి ధూపకలశం చేత్తో పట్టుకుని ఉన్నాడు. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కనే అతడు ఉన్నప్పుడు యాజకులు చూస్తూ ఉండగానే అతని నుదుటిపై కుష్టురోగం పుట్టింది.

20 ప్రధానయాజకుడైన అజర్యా, అతనితో ఉన్న యాజకులంతా అతని వైపు చూసినప్పుడు అతని నొసట కుష్టు కనిపించింది. కాబట్టి ఆలస్యం చేయకుండా అతడు అక్కడనుంచి బయటికి వెళ్లాలని వారు చెప్పారు. యెహోవా తనను దెబ్బ కొట్టాడని తెలుసుకుని బయటికి వెళ్ళడానికి అతడు కూడా త్వరపడ్డాడు.

21 రాజైన ఉజ్జియా చనిపోయే వరకూ కుష్టురోగిగానే ఉన్నాడు. కుష్టురోగిగా యెహోవా మందిరంలోకి పోకుండా కడగా ఉన్నాడు. కాబట్టి అతడు ప్రత్యేకంగా ఒక ఇంట్లో నివసించేవాడు. అతని కొడుకు యోతాము, రాజ భవనం మీద అధిపతిగా దేశప్రజలకు న్యాయం తీర్చేవాడు.

22 ఉజ్జియా గురించిన ఇతర విషయాలు ఆమోసు కుమారుడూ ప్రవక్త అయిన యెషయా రాశాడు.

23 ఉజ్జియా తన పూర్వీకులతో కూడా కన్ను మూశాడు. అతడు కుష్టురోగి అని రాజులకు చెందిన శ్మశానభూమిలో అతని పూర్వీకుల దగ్గర అతణ్ణి పాతిపెట్టారు. అతని కొడుకు యోతాము అతనికి బదులు రాజయ్యాడు.