1 Chronicles 23 in Telugu

1 దావీదు సంవత్సరాలు నిండిన వృద్ధుడయ్యాడు. కాబట్టి అతడు తన కొడుకు సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు.

2 ఇంకా అతడు ఇశ్రాయేలీయుల నాయకులందరినీ, యాజకులనూ, లేవీయులనూ సమావేశపరచాడు.

3 అప్పుడు లేవీయులు ముప్ఫై సంవత్సరాలు మొదలుకుని అంతకు పైవయస్సు ఉన్న వాళ్ళను లెక్కలో చేర్చారు. వాళ్ళ సంఖ్య ముప్ఫై ఎనిమిది వేలు.

4 వాళ్ళల్లో ఇరవై నాలుగు వేలమంది యెహోవా మందిరం పని పర్యవేక్షించే వారుగా, ఆరు వేల మంది అధికారులుగా న్యాయం తీర్చేవారుగా ఉన్నారు.

5 నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమితులయ్యారు. మరో నాలుగు వేలమందిని దావీదు చేయించిన వాయిద్యాలతో యెహోవాను స్తుతించేవాళ్ళుగా నియమించారు.

6 వారిని దావీదు గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు, అనే లేవీయుల గుంపులుగా దావీదు భాగించాడు.

7 గెర్షోనీయుల్లో లద్దాను, షిమీ అనే వాళ్ళు ఉన్నారు. లద్దాను కొడుకులు ముగ్గురు.

8 వాళ్ళు యెహీయేలు, జేతాము, యోవేలు.

9 షిమీ కొడుకులు ముగ్గురు. వాళ్ళు షెలోమీతు, హజీయేలు, హారాను. వీళ్ళు లద్దాను వంశానికి నాయకులు.

10 యహతు, జీనా, యూషు, బెరీయా అనే నలుగురూ షిమీ కొడుకులు.

11 యహతు పెద్దవాడు, జీనా రెండోవాడు. యూషుకూ బెరీయాకూ కొడుకులు ఎక్కువ మంది లేరు గనుక తమ పూర్వీకుల యింటివారిలో వారిని ఒక్క వంశంగా లెక్కించారు.

12 కహాతు కొడుకులు నలుగురు. వాళ్ళు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.

13 అమ్రాము కొడుకులు అహరోను, మోషే. అహరోనునూ, అతని కొడుకులనూ నిత్యం అతి పరిశుద్ధ వస్తువులను ప్రతిష్ఠించడానికీ, యెహోవా సన్నిధిలో ధూపం వెయ్యడానికీ, ఆయన సేవ జరిగించడానికీ, ఆయన పేరునుబట్టి ప్రజలను దీవించడానికీ ప్రత్యేకించారు.

14 దైవసేవకుడు మోషే సంతతిని లేవి గోత్రం వాళ్ళల్లో లెక్కించారు.

15 మోషే కొడుకులు గెర్షోము, ఎలీయెజెరు.

16 గెర్షోము కొడుకుల్లో షెబూయేలు పెద్దవాడు.

17 ఎలీయెజెరుకు సంతానం రెహబ్యా. అతనికి ఇంకెవ్వరూ కొడుకులు లేరు. అయితే రెహబ్యాకు చాలా మంది కొడుకులున్నారు.

18 ఇస్హారు కొడుకుల్లో షెలోమీతు పెద్దవాడు.

19 హెబ్రోను కొడుకుల్లో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండోవాడు, యహజీయేలు మూడోవాడు, యెక్మెయాము నాలుగోవాడు.

20 ఉజ్జీయేలు కొడుకుల్లో మీకా పెద్దవాడు, యెషీయా రెండోవాడు.

21 మెరారి కొడుకులు మహలి, మూషీ. మహలి కొడుకులు ఎలియాజరు, కీషు.

22 ఎలియాజరు చనిపోయినప్పుడు అతనికి కూతుళ్ళు ఉన్నారు గాని కొడుకులు లేరు. కీషు కొడుకులూ, వాళ్ళ సహోదరులూ వాళ్ళను పెళ్లి చేసుకున్నారు.

23 మూషీ కొడుకులు ముగ్గురు. వాళ్ళు మహలి, ఏదెరు, యెరీమోతు.

24 వీళ్ళు తమ పూర్వికుల వంశాల ప్రకారం లేవీయులుగా లెక్కించారు. పూర్వీకుల ఇళ్ళకు పెద్దలైన వీళ్ళు ఇరవై సంవత్సరాలు మొదలుకుని అంతకు పైవయస్సు గలవారు తమ తమ పేర్ల లెక్క ప్రకారం ఒక్కొక్కరుగా లెక్కకు వచ్చి, యెహోవా మందిరపు సేవ పని చేసేవారయ్యారు.

25 అప్పుడు దావీదు “ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా తన ప్రజలకు నెమ్మది దయచేశాడు గనుక వాళ్ళు నిత్యం యెరూషలేములో నివాసం చేస్తారు.

26 లేవీయులు కూడా ఇక మీదట గుడారాన్నైనా, దాని సేవకొరకైన ఉపకారణాలనైనా మోసే పని లేదు” అని చెప్పాడు.

27 దావీదు ఇచ్చిన చివరి ఆజ్ఞను బట్టి లేవీయుల్లో ఇరవై సంవత్సరాలు మొదలుకుని అంతకు పైవయస్సు ఉన్నవాళ్ళు లెక్కలోకి వచ్చారు.

28 వీళ్ళు అహరోను సంతతివాళ్ళ చేతి కింద పనిచెయ్యాలి. వాళ్ళ వశంలో ఉన్న యెహోవా మందిర సేవ కోసం శాలల్లో, గదుల్లో ఉంచిన ప్రతిష్ఠిత వస్తువులు అన్నీ శుద్ధి చెయ్యడానికీ, దేవుని మందిర సేవ కొరకైన పనిని పర్యవేక్షించడానికీ వారు ఉన్నారు.

29 సన్నిధి రొట్టెలు, నైవేద్యం కోసం కావలసిన మెత్తని పిండి, పులియని అప్పడం, పెనంలో కాల్చిన దాన్నీ, నూనెలో వేయించిన దాన్నీ, నానారకాలైన పరిమాణాల, కొలతల చొప్పున సిద్ధపరచడం వారి పని.

30 ప్రతిరోజూ ఉదయ సాయంకాలాల్లో యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడడానికీ కొందరు ఉన్నారు. విశ్రాంతి దినాల్లో, అమావాస్యల్లో, పండగల్లో, యెహోవాకు దహనబలులను అర్పించాల్సిన సమయాలన్నిట్లో లెక్క ప్రకారం తమ వంతు ప్రకారం నిత్యం యెహోవా సన్నిధిలో సేవ జరిగించడానికి వారిని నియమించారు.

31 సమాజపు గుడారాన్ని, పరిశుద్ధ స్థలాన్ని కాపాడడం,

32 యెహోవా మందిరపు సేవతో సంబంధం ఉన్న పనుల్లో తమ సహోదరులైన అహరోను సంతతి వాళ్లకు సాయం చెయ్యడం, వాళ్లకు నియమించిన పని.